New Delhi: రోహిత్ శేఖర్‌ తివారీ హత్య కేసు...అసలు నిందితులు ఎవరు?

  • కుటుంబ సభ్యులపైనే పోలీసుల అనుమానాలు
  • సాధారణ మరణమే అంటున్న తల్లి
  • ఊపిరాడకుండా చంపేశారంటున్న పోస్టుమార్టం నివేదిక

సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ దివంగత ఎన్‌.డి.తివారి కొడుకు రోహిత్ శేఖర్‌ తివారీ మర్డర్‌ మిస్టరీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అతన్ని హత్య చేశారని పోస్టుమార్టం నివేదిక ద్వారా వెల్లడి కావడంతో కుటుంబ సభ్యుల చుట్టూనే అనుమానాలు తిరుగుతున్నాయి. కానీ స్వయంగా రోహిత్‌ తల్లే తన కొడుకుది సహజ మరణం అంటుండడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

తాను ఎన్‌.డి.తివారీ కొడుకునేనని నిరూపించుకునేందుకు ఆరేళ్ల క్రితం న్యాయస్థానం సాక్షిగా తీవ్ర పోరాటం చేసిన రోహిత్‌ అప్పట్లో దేశ ప్రజలందరి దృష్టినీ ఆకర్షించారు. డీఎన్‌ఏ పరీక్షల్లో పాజిటివ్‌ రావడంతో 2014లో రోహిత్‌ తన కొడుకేనని తివారీ అంగీకరించక తప్పలేదు. ఆ తర్వాత మరెటువంటి వివాదం వెలుగుచూడలేదు.

కుటుంబ పెద్ద చనిపోతే ఆస్తుల విషయమై వివాదాలు రేగడం సహజం. కానీ తివారీ చనిపోయినప్పుడు అటువంటివి ఏమీ బయటపడ లేదు. ఈ నేపథ్యంలో ఆకస్మాత్తుగా రోహిత్‌ మరణం పెద్ద దుమారమే రేపుతోంది. ముఖంపై దిండుతో నొక్కిపట్టి ఊపిరాడకుండా చేయడం వల్ల రోహిత్‌ చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. దీంతో కుటుంబ సభ్యుల్లోనే ఎవరైనా ఈ హత్యకు పాల్పడి ఉంటారన్న కోణంలో పోలీసు దర్యాప్తు చేస్తున్నారు.

రోహిత్‌ తల్లి ఉజ్వలా తివారి తన కొడుకు మామూలుగానే చనిపోయాడని చెబుతుండడం పోలీసుల ముందర కాళ్లకు బంధం వేస్తోంది. చనిపోవడానికి ముందు రోహిత్‌ ఓటు వేసేందుకు ఉత్తరాఖండ్‌ వెళ్లాడని, ఏప్రిల్‌ 15న తిరిగి ఢిల్లీ చేరుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. 16వ తేదీన రోహిత్‌ ఆపస్మారక స్థితిలో ఉన్నాడని, ముక్కు నుంచి రక్తం కారుతోందని సమాచారం అందడంతో తాను హుటాహుటిన ఇంటికి వెళ్లానని, అంబులెన్స్‌లో మ్యాక్స్‌ ఆసుపత్రికి తరలించినట్లు ఉజ్వల చెబుతున్నారు. ఆ సమయంలో రోహిత్‌ భార్య అపూర్వ, ఆమె బంధువులు కూడా ఉన్నట్లు ఆమె కథనం.

రోహిత్‌ది సహజ మరణమే అయితే ఊపిరాడక పోవడంతో చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక ఎందుకు చూపుతుందన్నది పోలీసుల ప్రశ్న. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు లేదా మరేదయినా బలమైన కారణం ఈ హత్యకు  ప్రేరణ అయి ఉండవచ్చునన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన రోహిత్‌ ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌కు గతంలో సలహాదారుగా పనిచేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే హత్య జరగడం రకరకాల అనుమానాలకు తావిస్తోంది.

  • Loading...

More Telugu News