Chandrababu: పోలింగ్ తరువాత చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన 18 జీవోలను రద్దు చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం!
- సమీక్షలకు హాజరైన 16 మంది అధికారులకు నోటీసులు
- పోలవరం, సీఆర్డీయేపై సమీక్షలు జరిపిన సీఎం
- తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల కమిషన్
- హోమ్ శాఖపై సమీక్షను రద్దు చేసుకున్న చంద్రబాబు
ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ పూర్తయిన తరువాత ఏపీ సర్కారు జారీ చేసిన 18 జీవోలను రద్దు చేయాలని ఈసీ సిఫార్సు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వాటిని రద్దు చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు నిర్వహించే సమీక్షా సమావేశాలకు హాజరైన 16 మంది అధికారులకు ఈసీ నుంచి సంజాయిషీ ఇవ్వాలంటూ నోటీసులు అందాయి.
వాస్తవానికి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత, ప్రకృతి విపత్తులు, పెను ప్రమాదాలు సంభవించినప్పుడు మాత్రమే సీఎం సమీక్షలను నిర్వహించుకోవచ్చు. అది కూడా ఈసీ అనుమతి తీసుకునే జరపాలి. అయితే, 11న పోలింగ్ ముగిసిన తరువాత, సీఎం తొలుత పోలవరంపై, ఆపై సీఆర్డీయేపై సమీక్షలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ కావడంతో తాను జరపాలని తలపెట్టిన హోమ్ శాఖ సమీక్షను చంద్రబాబు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ సమావేశాలకు అధికారులు వెళ్లకూడదు. అయినా, కొందరు వెళ్లడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం. ఇక రద్దు చేసిన జీవోల్లో అత్యధికం కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులవేనని తెలుస్తోంది.