Narendra Modi: మోదీకి బాలాకోట్‌కు, బాగల్కోట్కు తేడా తెలియదు: కుమారస్వామి
- మోదీ కంటే మా నాన్న దేవెగౌడ ఎంతో బెటర్
- ఆయన హయాంలో దేశంలో ఒక్క ఉగ్ర ఘటన కూడా జరగలేదు
- వ్యక్తిగత ప్రయోజనాల కోసం మోదీ తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారు
కాంగ్రెస్-జేడీఎస్ ఓటు బ్యాంకు ఉన్నది బాగల్‌కోట్‌లోనా? లేక, బాలాకోట్‌లోనా? అన్న ప్రధాని నరేంద్రమోదీ ప్రశ్నకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఘాటుగా బదులిచ్చారు. తాజా ఇంటర్వ్యూలో కుమారస్వామి మాట్లాడుతూ.. నిజానికి ప్రధానికి బాగల్కోట్కు-బాలాకోట్‌కు మధ్య ఉన్న తేడా తెలియదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం బాలాకోట్ దాడులను ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు.
మోదీ ఐదేళ్ల పాలనకంటే తన తండ్రి, హెచ్డీ దేవెగౌడ పది నెలల పాలనతోనే దేశం భద్రంగా ఉందన్నారు. దేవెగౌడ హయాంలో దేశంలో ఒక చిన్న ఉగ్రదాడి కూడా జరగలేదని, దేశం ప్రశాంతంగా ఉందని అన్నారు. ఆయన హయాంలో జమ్ముకశ్మీర్ ఎంతో ప్రశాంతంగా ఉందని, చిన్న బాంబు దాడి కూడా జరగలేదని గుర్తు చేశారు.
‘‘దేశానికి ఎంతోమంది ప్రధానులు అయ్యారు. కానీ ఎవరూ తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం భారత్-పాక్ సమస్యను ఉపయోగించుకోలేదు’’ అని మోదీపై దుమ్మెత్తిపోశారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో కన్నీరు పెట్టుకున్న విషయంపై కుమారస్వామి స్పందిస్తూ.. తాను చాలా సున్నిత మనస్కుడినని, చిన్న విషయాలకే ఉద్వేగానికి లోనవుతుంటానని వివరించారు.