Guntakal: కొడుకు తరిమేశాడంటూ పోలీసులను ఆశ్రయించిన టీడీపీ నేత!
- ఇల్లు లాక్కుని బయటకు గెంటేశారు
- కారు షెడ్లో కూర్చుని ఉండాల్సి వచ్చింది
- గుంతకల్లు టీడీపీ నేత కోటిరెడ్డి ఫిర్యాదు
తమ కుమారుడు ఆస్తులన్నీ లాక్కుని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడంటూ అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ తెలుగుదేశం పార్టీ నేత జీ కోటిరెడ్డి, ఆయన భార్య, కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ మాజీ ధర్మకర్త సుశీలమ్మ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన వీరు, బంధువులు, స్నేహితులు నచ్చజెప్పినా తమ బిడ్డ సాయినాథ్ రెడ్డి వినడం లేదని వాపోయారు.
తమ మనుమరాలి పేరిట ఉన్న ఇంట్లో ఉంటుండగా, బయటకు గెంటేశాడని, జీవనాధారం లేకుండా చేశాడని, కారును కూడా లాక్కున్నాడని చెప్పారు. చేసేదేమీ లేక కారు షెడ్లో తాము కూర్చోవాల్సి వచ్చిందని అన్నారు. గతంలో తన భార్యను కుమారుడు కొట్టగా, డీఎస్పీ రవికుమార్, అతన్ని పిలిపించి మందలించారని, అయినా పద్ధతి మార్చుకోలేదని కన్నీరు పెట్టుకున్నారు. గతంలో క్రికెట్ బెట్టింగుల్లో భారీగా నష్టపోతే, తానే ఇంటిని అమ్మేసి ఆ అప్పులు తీర్చానని అన్నారు. కోటిరెడ్డి దంపతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ ప్రారంభించారు.