mano: రాత్రివేళ రజనీ ఫోన్ చేసి మరీ అభినందించారు: సింగర్ మనో
- నా వాయిస్ రజనీ వాయిస్ లా ఉందని అంటారు
- 'ముత్తు' నుంచి నేనే ఆయనకి డబ్బింగ్ చెబుతున్నాను
- 'శివాజీ' తెలుగు వెర్షన్ చూసి ఆయన నాకు కాల్ చేశారు
తెలుగు .. తమిళ భాషల్లో గాయకుడిగా 'మనో'కి మంచి క్రేజ్ వుంది. ఆయన పాటలు చాలా వరకూ పాప్యులర్ అయ్యాయి. డబ్బింగ్ కళాకారుడిగా కూడా మనోకి మంచి పేరుంది. ముఖ్యంగా రజనీకాంత్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పడం ద్వారా 'మనో' క్రేజ్ మరింత పెరిగింది. తాజా ఇంటర్వ్యూలో 'మనో' దీని గురించి మాట్లాడుతూ .. "రజనీకాంత్ కి తెలుగులో డబ్బింగ్ చెప్పే అవకాశం రావడం నా అదృష్టం. 'ముత్తు' నుంచి ఆయన సినిమాలకి వరుసగా డబ్బింగ్ చెబుతూ వస్తున్నాను.
తమిళంలో రజనీ వాయిస్ ఎలా వుంటుందో .. తెలుగులో నా వాయిస్ అలాగే ఉంటుందని అంటూ వుంటారు. ఆయన కోసమని నేను వాయిస్ మార్చను .. ఆయన స్పీడ్ ను .. స్టైల్ ను యాడ్ చేసుకుంటాను అంతే. 'శివాజీ' తెలుగు వెర్షన్ కి నేను డబ్బింగ్ చెప్పాక, ఓ రోజు రాత్రి నాకు ఆయన కాల్ చేశారు. 'నేను .. రజనీ .. ' అన్నారు తమిళంలో. నా ఫ్రెండ్స్ ఆటపట్టిస్తున్నారనుకుని 'ఏ రజనీ .. 'అన్నాను. ఆయన గట్టిగా నవ్వడంతో .. అర్థమైపోయింది. 'సారీ సార్ .. 'అంటూ విషయం చెప్పాను. 'తమిళంలో 'శివాజీ'కి నేను చెప్పిన డబ్బింగ్ కంటే తెలుగులో మీరు చెప్పిన డబ్బింగ్ బాగుంది .. థ్యాంక్స్' అన్నారు. ఆయనలా నేరుగా కాల్ చేసి అభినందించడాన్ని నా జీవితంలో మరిచిపోలేను" అని చెప్పుకొచ్చారు.