Kala Venkatrao: జగన్ ఆ ఒక్క విషయం తెలుసుకోలేకపోతున్నారు: కళా వెంకట్రావు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-9d79cb2a9d6fcf6a1b155e92ecf59a09977ad20f.jpg)
- ప్రజలంతా టీడీపీ వైపు నిలిచారు
- జగన్ కల్పించిన ఆటంకాలను అధిగమించి ఓట్లేశారు
- జగన్ కు బహిరంగ లేఖ రాసిన కళా వెంకట్రావు
ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రతిపక్ష నేత జగన్ కు మరోసారి బహిరంగ లేఖాస్త్రం సంధించారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలియడంతో జగన్ అనేక విధాలుగా ఆటంకాలు సృష్టించారని, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అయితే, అన్ని అడ్డంకులను ప్రజలు ధైర్యంగా అధిగమించి ఓటు వేశారని తెలిపారు. జగన్ కుట్రలను ఛేదించి 80 శాతం మంది ప్రజలు పోలింగ్ లో పాల్గొన్నారని కళా వివరించారు. ప్రజలంతా టీడీపీ వైపు నిలిచినా, జగన్ మాత్రం ఆ విషయం తెలుసుకోలేకపోతున్నారంటూ విమర్శించారు.
చంద్రబాబు ప్రజా సంక్షేమం కోసం సమీక్షలు నిర్వహిస్తున్నా, వైసీపీ నేతలు అడ్డుతగులుతున్నారని, చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనం అని పేర్కొన్నారు. పెరిగిన ఓటింగ్ శాతం 'మిషన్ 150'కి ఊతమిస్తోందని కళా వెంకట్రావు తన లేఖలో నమ్మకం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కావాలని జగన్ కలలు కంటున్నారని, కానీ అది ఈ జన్మలో జరగదని స్పష్టం చేశారు.