Krishna District: ఇంత పనికిమాలిన ఈసీని ఎప్పుడూ చూడలేదు: వర్ల రామయ్య ఫైర్
- కోడూరులోని ఓ బూత్ లో ఎక్కువ ఓట్లు పోలయ్యాయి
- రిగ్గింగ్ జరిగినట్టే కదా?
- సీఈఓ ద్వివేదికి ఫిర్యాదు చేశా
కోడూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ బూత్ లో 109 శాతం ఓట్లు పోలవడం దారుణమైన విషయమని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఈ మేరకు ఏపీ సీఈఓ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం, మీడియాతో వర్ల రామయ్య మాట్లాడుతూ, కోడూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ బూత్ లో 703 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషుల ఓట్లు 366 అని చెప్పారు. కానీ, పురుషుల ఓట్లు 370 పోలయ్యాయని, ఇదెలా సాధ్యం అని ప్రశ్నించారు.
ఎన్నికల కమిషన్ వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? రిగ్గింగ్ జరిగినట్టే కదా? అక్కడి ఆర్వో, జిల్లా యంత్రాంగం ఏం చేస్తోంది? అని మండిపడ్డారు. ఆ బూత్ లో రిగ్గింగ్ జరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తోందని, దీనిపై కూడా సీఈఓ ద్వివేదికి ఫిర్యాదు చేశామని, ఈ ఫిర్యాదు చూసిన ఆయన నోరు వెళ్లబెట్టారని వ్యాఖ్యానించారు. ఈ బూత్ లో 109 శాతం ఓట్లు పోలయ్యాయని, ఇంత పనికిమాలిన ఈసీని ఎప్పుడూ చూడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.