Telugudesam: తమిళనాడులోనూ అదే సీన్! వీవీ ప్యాట్ స్లిప్ 7 సెకన్లు కాదు 3 సెకన్లే కనిపించింది!: హరిప్రసాద్
- వీవీ ప్యాట్ స్లిప్పు నిర్దేశిత సమయంపాటు కనిపించడంలేదు
- ఇప్పుడు తమిళనాడులో కూడా బట్టబయలైంది
- ఈసీ క్లారిటీ ఇవ్వాలి
ఆంధ్రప్రదేశ్ ఐటీ సలహాదారు వేమూరు హరిప్రసాద్ మరోసారి వీవీ ప్యాట్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈవీఎంలో ఓటేసిన తర్వాత వీవీ ప్యాట్ లో రసీదు స్లిప్పు 7 సెకన్ల పాటు కనిపిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతుండగా, అది కేవలం 3 సెకన్లే కనిపిస్తోందని టీడీపీ నేతలు ముక్తకంఠంతో నినదించడం తెలిసిందే. మొన్నటి ఏపీ పోలింగ్ లో వీవీ ప్యాట్ స్లిప్పుల విషయంలో ఎన్నికల కమిషన్ పొందుపరిచిన కోడ్ మారిపోయిందంటూ హరిప్రసాద్ ఆరోపించారు. ఇప్పుడాయన తన ఆరోపణలకు మరింత బలం చేకూర్చే సంఘటన వెలుగులోకి తెచ్చారు.
నేడు తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు జరుగుతుండగా, వేలాచెరి నియోజకవర్గంలో ఓ పోలింగ్ కేంద్రంలో వీవీ ప్యాట్ స్లిప్పు 7 సెకన్లకు బదులు కేవలం 3 సెకన్లు మాత్రమే డిస్ ప్లే అయిందంటూ ట్వీట్ చేశారు. చెన్నై బీసెంట్ నగర్ లోని బీసెంట్ థియోసాఫికల్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ నం.26లో ఒక ఓటరుకు ఈ అనుభవం ఎదురైందని హరిప్రసాద్ వివరించారు. ఇది వీవీ ప్యాట్ లోపమా? లేక, ఉద్దేశపూర్వకంగా మార్చేశారా? అనేది కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేశారు.