Andhra Pradesh: సత్తెనపల్లిలో కోడెల అరాచకాలకు హద్దే లేదు.. ప్రజాస్వామ్యాన్ని ఆయన మంటకలిపారు!: సి.రామచంద్రయ్య

  • కోడెల తీరు ఏపీ చరిత్రలోనే చీకటి అధ్యాయం
  • రోజాను ఏకపక్షంగా ఏడాది సస్పెండ్ చేశారు
  • హైదరాబాద్ లో మీడియాతో వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ ఔన్నత్యాన్ని టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు మంట కలిపారని వైసీపీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య మండిపడ్డారు. కంచే చేను మేసిన చందంగా కోడెల వ్యవహరించారని దుయ్యబట్టారు. ఆయన ఏపీ అసెంబ్లీని నడిపిన తీరు రాష్ట్ర చరిత్రలోనే చీకటి అధ్యాయమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఆయన ప్రతిపక్షం గొంతు నొక్కేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రామచంద్రయ్య మాట్లాడారు.

వైసీపీ ఎమ్మెల్యే రోజాను కోడెల ఏకపక్షంగా ఏడాదిపాటు సస్పెండ్ చేశారని రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏపీ అసెంబ్లీ కార్యక్రమాలన్నీ టీడీపీ కార్యక్రమాలుగా మార్చివేశారు.ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హతను ఆయన కోల్పోయారు. సత్తెనపల్లిలో ఆయన కుటుంబ సభ్యుల అరాచకాలకు హద్దే లేదు. అధికారం శాశ్వతం కాదని కోడెల గుర్తుంచుకోవాలి. కోడెల బెదిరింపులకు ఇక్కడ భయపడే వారెవరూ లేరు’ అని స్పష్టం చేశారు.

చంద్రబాబును ఎవరితో పోల్చినా వారిని అవమానించినట్లేనని ఎద్దేవా చేశారు. స్పీకర్ పదవికి కళంకం తెచ్చిన అప్రజాస్వామికవాది కోడెల అని రామచంద్రయ్య విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు గత ఐదేళ్లుగా అరాచక పాలన చేశారని దుయ్యబట్టారు. తన అవినీతి బయటపడుతుందని చంద్రబాబు ఇప్పుడు భయపడుతున్నారని ఆరోపించారు.

ఎన్టీఆర్, ఇందిరాగాంధీ వంటి హేమాహేమీలనే ప్రజలు ఓడించారనీ, చంద్రబాబు ఇందుకు అతీతుడు కాదని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నుంచి తీసుకుని ఏం చేశారని ప్రశ్నించారు. పట్టిసీమ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదనీ, నిధులు నిరుపయోగం అయ్యాయని తెలిపారు.

  • Loading...

More Telugu News