Heat: తెలుగు రాష్ట్రాల్లో నేడు చిరుజల్లులు, రేపు ఓ మోస్తరు వర్షాలు!

  • 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి
  • ఒకటిన్నర కిలోమీటర్ ఎత్తులో ఉపరితల ఆవర్తనం
  • పెరుగుతున్న ఎండల నుంచి ఉపశమనం ఇచ్చేలా వర్షాలు

దక్షిణ మహారాష్ట్ర కర్ణాటక, తమిళనాడుల మీదుగా కోమెరిన్ వరకూ 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఉన్నందున వాతావరణ పరిస్థితులు మారాయని, తెలుగు రాష్ట్రాల్లో నేడు అక్కడక్కడా జల్లులు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం తెలిపింది.

ద్రోణికి తోడుగా ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కూడా ఉందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం పరిధిలో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లోనూ వర్షాలకు అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఓ అధికారి తెలిపారు.

ఇదిలావుండగా, తెలుగు రాష్ట్రాలలో సూర్యతాపం మరింతగా పెరిగింది. ఇప్పటికే సాధారణం కన్నా 2 డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, రానున్న రోజుల్లో ఎండ వేడిమి మరింతగా పెరగవచ్చని అధికారులు వెల్లడించారు. బుధవారం నాడు తిరుపతిలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడపలో 42.4 డిగ్రీలు, నంద్యాలలో 31.2 డిగ్రీలు, విజయవాడలో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, తెలంగాణలోని హైదరాబాద్ లో 38 డిగ్రీలు, రామగుండంలో 44 డిగ్రీలు, నిజామాబాద్ లో 43.5 డిగ్రీలు, వరంగల్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News