Prakash Raj: క్యూలో ఓపిగ్గా నిల్చుని ఓటేసిన రజనీకాంత్, కమల్‌హాసన్, శ్రుతిహాసన్
- ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- ఓటేసిన ముఖ్యమంత్రులు, సినీస్టార్లు
- ఓటుహక్కు వినియోగించుకున్న పుదుచ్చేరి, మణిపూర్ గవర్నర్లు
సార్వత్రిక ఎన్నికల రెండోదశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దేశంలోని 11 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలోని 95 నియోజకవర్గాల్లో ఈ ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 1,611 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ ప్రారంభానికి ముందు నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మరోవైపు పలువురు ప్రముఖులు కూడా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం, ఆయన భార్య నళినీ చిదంబరం, కుమారుడు కార్తీ చిదంబరం, ఆయన భార్య శ్రీనిధి రంగరాజన్‌లు శివగంగలోని కరైకుడిలోని పోలింగ్ స్టేషన్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నై సెంట్రల్ పార్లమెంటరీ నియోజవర్గంలోని స్టెల్లా మేరిస్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటేశారు.
కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే షోలాపూర్‌లో, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరులోని జయనగర్‌లో, తమిళ సూపర్ స్టార్, మక్కల్ నీది మయ్యమ్ చీఫ్ కమల్ హాసన్, ఆయన కుమార్తె శ్రుతిహాసన్‌లు చెన్నైలోని ఆళ్వార్‌పేట కార్పొరేషన్ స్కూల్లో, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి సేలంలోని ఎడప్పాడిలోనూ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
పుదుచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడీ పుదుచ్చేరిలో, మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లా ఇంఫాల్‌లో, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి పుదుచ్చేరిలో, బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.