polling: నేడు రెండో దశ పోలింగ్.. 95 నియోజకవర్గాల బరిలో 1,611 మంది అభ్యర్థులు
- ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్
- తమిళనాట అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న కమల్ పార్టీ
- బరిలో పలువురు ప్రముఖులు
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు రెండోదశ పోలింగ్ ప్రారంభమైంది. 11 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 95 నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. చాలా ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మొత్తం 1,611 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. త్రిపుర తూర్పు లోక్‌సభ స్థానంతోపాటు తమిళనాడులోని వెల్లూరు నియోజకవర్గానికి కూడా నేడే ఎన్నిక జరగాల్సి ఉండగా.. వెల్లూరు ఎన్నికను రద్దు చేసిన అధికారులు, త్రిపుర తూర్పు ఎన్నికను మూడో దశకు మార్చారు.
కేంద్రమంత్రులు జితేంద్రసింగ్, జ్యుయల్ ఓరం, సదానందగౌడ, పొన్ రాధాకృష్ణన్, మాజీ ప్రధాని దేవెగౌడ, డీఎంకే నేతలు దయానిధి మారన్, ఎ.రాజా, కనిమొళి తదితరులు ఈ దశలోనే ఉన్నారు. కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తర్‌ప్రదేశ్‌లో 8, అసోం, బీహార్‌లో 5, ఒడిశాలో 5, ఛత్తీస్‌గఢ్‌లో 3, పశ్చిమ బెంగాల్‌లో 3, జమ్ముకశ్మీర్‌లో 2 సీట్లు, మణిపూర్, పుదుచ్చేరిల్లో ఒక్కో సీటుకు పోలింగ్ జరగనుంది. తమిళనాడులో దినకరన్ ఏర్పాటు చేసిన ఏఎంఎంకేతోపాటు నటుడు కమలహాసన్ పార్టీ ఎంఎన్‌ఎం కూడా పోటీలో వుంది. కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం శివగంగలోని కరైకుడిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.