kaleswaram: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతం
- ఎల్లంపల్లి నుంచి గ్రావిటీ కెనాల్ లోకి నీటి విడుదల
- నాలుగైదు రోజుల్లో సర్జ పూల్ కు చేరనున్న నీరు
- ‘వెట్ రన్’కు సిద్ధమైన అధికారులు
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వెట్ రన్ కోసం ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం ఆరో ప్యాకేజ్ సొరంగంలోకి ఇంజనీర్లు, అధికారులు నీటిని విడుదల చేశారు. గ్రావిటీ కెనాల్ లోకి నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి నుంచి 1.1 కిలోమీటర్ల పొడవునా గ్రావిటీ కెనాల్ ద్వారా 9.534 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా నందిమేడారం పంప్ హౌస్ లోని సర్జ్ పూల్ కు ఈ నీటిని విడుదల చేశారు. నాలుగైదు రోజుల్లో సర్జ్ పూల్ కు నీరు చేరనుంది. నందిమేడారం పంప్ హౌజ్ లో 124.4 మెగావాట్ల సామర్థ్యం గల భారీ మోటార్లను వినియోగించనున్నారు. ఈ మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసే వెట్ రన్ చేపట్టనున్నారు. కాగా, తెలంగాణలో గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకునేందుకు వీలుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు కొన్ని బ్యారేజ్ లు, పంపు హౌస్ లు, కాలువలు, సొరంగాల సమాహారం.