Prudhvi Raj: వైఎస్ కు చిత్రపరిశ్రమలో ఒక్కరూ సాయం చేయలేదు.. ధర్మవరపు సుబ్రహ్మణ్యం చాలా కష్టపడ్డారు!: నటుడు పృథ్వీ
- వైఎస్ పాదయాత్రకు అద్భుతమైన స్పందన వచ్చింది
- కాంగ్రెస్ యాడ్ల తయారీకి థియేటర్లను కూడా ఇవ్వలేదు
- ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ నేత
వైసీపీ అధికారంలోకి వస్తే సినిమా పరిశ్రమ అభివృద్ధి ఆగిపోతుందని టీడీపీ నేతలు చెప్పడాన్ని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నటుడు పృథ్వీ ఖండించారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘వైఎస్ ప్రతిపక్ష నేతగా 2004లో పాదయాత్ర చేసినప్పుడు అద్భుతమైన స్పందన వచ్చింది.
అప్పుడు కాంగ్రెస్ అభిమానిగా ఉన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొన్ని యాడ్లు, ప్రమోషనల్ కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది. అప్పుడు చిత్ర పరిశ్రమలో ఎవ్వరూ సాయం చేయలేదు. కాంగ్రెస్ కు యాడ్లు చేసే ఇతనికి మన థియేటర్లు ఎందుకు ఇవ్వాలి? మనం ఎందుకు సహకరించాలి? మనం ఛీకొట్టాలి ఇతడిని అనుకున్నారు.
దాంతో సికింద్రాబాద్ లోని సువార్త వాణి థియేటర్ లో సాంగ్ కంపోజ్ చేశారు. అలాగే గుంటూరు, విజయవాడలోని క్రైస్తవ రికార్డింగ్ థియేటర్లలో పాటలను రికార్డు చేశారు. అలా వైఎస్ కు ధర్మవరపు సుబ్రహ్మణ్యం దగ్గరయ్యారు. కానీ 2004లో ఎన్నికలు అయిపోగానే ఈ సినిమా పెద్దలంతా వైఎస్ దగ్గరకు వెళ్లగానే.. ‘అయ్యా.. ఒక్క థియేటర్ అయినా ఇచ్చారా? ఒక్క ఆర్టిస్ట్ ను అయినా పంపించారా? మళ్లీ మీరంతా వచ్చి చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతున్నారు’ అని వైఎస్ అన్నారని పృథ్వీ చెప్పుకొచ్చారు.