Cricket: భారత క్రికెట్లో పెద్ద తలకాయల్ని వెంటాడుతున్న విరుద్ధ ప్రయోజనాల అంశం!
- గంగూలీపై బీసీసీఐకి ఫిర్యాదు చేసిన క్రికెట్ అభిమానులు
- క్రికెట్ సలహా కమిటీ పదవికి రాజీనామా చేసేందుకు గంగూలీ మొగ్గు
- అదే బాటలో సచిన్, లక్ష్మణ్?
భారత క్రికెట్లో కొంతకాలంగా పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం చర్చనీయాంశంగా ఉంటోంది. ఒకటికి మించి పదవుల్లో కొనసాగుతున్న ప్రముఖులు ఏదో ఒక పదవే చూసుకోవాలంటూ కొన్నాళ్ల క్రితం భారత క్రికెట్ నిబంధనల్లో స్పష్టం చేశారు. బీసీసీఐ కూడా ఈ విషయంలో కఠినంగానే వ్యవహరిస్తోంది. తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే, ఈసారి అభిమానులే ఫిర్యాదు చేయడం ఆసక్తి కలిగిస్తోంది.
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెంటార్ (మార్గదర్శకుడు)గా వ్యవహరిస్తున్నాడు. అయితే, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న గంగూలీ కోల్ కతాలో ఢిల్లీ జట్టు ఆడే మ్యాచ్ కు పిచ్ క్యూరేటర్ ను ప్రభావితం చేసే అవకాశం ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. ఆ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టే గెలిచింది. తనపై ఫిర్యాదుపై గంగూలీ స్పందిస్తూ, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్ష పదవి, ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారు పదవి పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు రాదని బీసీసీఐ అంబుడ్స్ మన్ ముందు వివరణ ఇచ్చాడు.
కానీ, అదే గంగూలీ బీసీసీఐ క్రికెట్ సలహాల కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. ఈ కమిటీలో గంగూలీతో పాటు సచిన్, లక్ష్మణ్ కూడా సభ్యులు. భారత జట్టుకు కోచ్ ను ఎంపిక చేయడంలో సలహాలు ఇవ్వడం ఈ కమిటీ పని. ఈ కమిటీలో సభ్యత్వం విషయాన్ని బీసీసీఐ అంబుడ్స్ మన్ ప్రశ్నించడంతో గంగూలీ తన పదవికి రాజీనామా చేసేందుకు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. గంగూలీనే కాదు, అటు సచిన్, లక్ష్మణ్ కూడా ఐపీఎల్ లో జట్లకు మెంటార్లుగా వ్యవహరిస్తున్నారు. గంగూలీ రాజీనామా చేస్తే మరి వాళ్లిద్దరూ ఏంచేస్తారో చూడాలి!