nara lokesh: ఇదంతా మన కర్మ: నారా లోకేశ్
- నేను పోలింగ్ బూత్ కు వెళ్లడం నిబంధనలకు విరుద్ధమని జగన్ అన్నారు
- పోలింగ్ తీరును పరిశీలించే హక్కు ప్రతి అభ్యర్థికి ఉంటుంది
- కనీస పరిజ్ఞానం కూడా లేని వ్యక్తి సీఎం కావాలనుకుంటున్నారు
వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. పోలింగ్ రోజున తాను పోలింగ్ బూత్ కు వెళ్లడాన్ని నిబంధనలకు విరుద్ధమంటూ జగన్ అన్నారని... పోలింగ్ సవ్యంగా జరుగుతోందో, లేదో పరిశీలించే హక్కు ప్రతి అభ్యర్థికి ఉంటుందని ఆయన అన్నారు. ఇంత మాత్రం కనీస పరిజ్ఞానం కూడా లేని వ్యక్తి ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తుండటం మన కర్మ అనుకోవాలని చెప్పారు.
ఏపీలో జగన్ ఘన విజయం సాధించబోతున్నారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఉద్దేశిస్తూ లోకేశ్ సెటైర్లు వేశారు. 'మొన్నెప్పుడో పేపర్లో చదివా. ఒక కోడి తలకాయ లేకుండా కొన్ని నెలల నుంచీ బతికేస్తుందంట. జగన్ లాంటి వ్యక్తి ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా నెట్టుకొచ్చాడు. ఈ విషయంతో పోలిస్తే కోడి సంగతి పెద్ద విచిత్రమా చెప్పండి' అని ఎద్దేవా చేశారు.