Dinesh Karthik: ధోనీ ఉన్నంత వరకూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ను మాత్రమే: దినేశ్ కార్తీక్ సంచలన వ్యాఖ్య
- ధోనీకి గాయమైతే ఆ రోజుకు బ్యాండ్ ఎయిడ్ గా పనికొస్తాను
- ఆడే అవకాశాలు దక్కవేమోనన్న భావనలో ఉన్న దినేశ్ కార్తీక్
- ధోనీ లేకపోతేనే దినేశ్ కు చాన్స్
"చూడండి... ఎంఎస్ ధోనీ జట్టులో ఉన్నంత వరకూ చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ మాదిరిగా జట్టుతో కలిసి ప్రయాణం చేస్తూ ఉండటమే నా పని. అతనికి గాయమైతే మాత్రమే ఆ రోజుకు నేను బ్యాండ్ ఎయిడ్ గా పనికొస్తాను" అని వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దినేశ్ కార్తీక్ వ్యాఖ్యానించాడు. మరికొన్ని రోజుల్లో బ్రిటన్ లో వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్న సందర్భంగా భారత జట్టులో ధోనీకి కవరింగ్ గా రెండో వికెట్ కీపర్ చాన్స్ కొట్టేసిన దినేశ్ కార్తీక్, తనకు ఆడే అవకాశాలు ఏ మేరకు దక్కుతాయన్న విషయంలో మాత్రం కాస్తంత బాధగానే ఉన్నట్టు తెలుస్తోంది.
ధోనీ కీపింగ్ చేస్తున్నంత కాలం, తుది జట్టులో దినేశ్ కనిపించే అవకాశాలు నామమాత్రంగా కూడా లేనట్టుగానే భావించాలి. ధోనీకి గాయమైనా, లేదా వరుసగా మ్యాచ్ లు గెలిచి, ప్రయోగాలు చేయాలన్న ఉద్దేశంతో రిజర్వ్ బెంచ్ కి అవకాశాలు కల్పించినా దినేశ్ కు అవకాశం లభిస్తుంది. అయితే, తాను 4వ నంబర్ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు కూడా అర్హుడినేనని, ఆ అర్హతతోనైనా తనకు మరిన్ని అవకాశాలు దక్కుతాయని భావిస్తున్నానని దినేశ్ అంటున్నాడు. కాగా, రెండో వికెట్ కీపర్ ప్లేస్ కు దినేశ్ తో పాటు రిషబ్ పంత్ కూడా పోటీ పడినప్పటికీ, సెలక్టర్లు దినేశ్ వైపే మొగ్గు చూపిన సంగతి తెలిసిందే.