Saudi Arebia: సౌదీలో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష... తలనరికి శిక్ష అమలు చేసిన అధికారులు!

  • మరో భాతీయుడిని హత్య చేసిన పంజాబ్ వాసులు
  • ఫిబ్రవరి 28న శిక్షను అమలు చేసిన సౌదీ
  • కనీసం ఎంబసీకి కూడా సమాచారం ఇవ్వని అధికారులు

సౌదీలో జరిగిన ఓ హత్య కేసులో ఇద్దరు భారతీయులకు కోర్టు మరణదండన శిక్ష విధించగా, అధికారులు వారిద్దరి తలలనూ నరికించడం ద్వారా శిక్షను అమలు చేశారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సౌదీ చట్టాల దృష్ట్యా, వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం లేదని పేర్కొంది.

పంజాబ్ లోని హోషియార్ పూర్ కు చెందిన సత్వీందర్ కుమార్, లూధియానాకు చెందిన హర్ జీత్ సింగ్ లు మరో భారతీయుడి హత్య కేసులో నిందితులు. ఫిబ్రవరి 28న వీరికి శిక్ష అమలు జరిగిందని, శిక్షలను అమలు చేసే సమయంలో రియాద్ లోని ఇండియన్ ఎంబసీకి సమాచారం ఇవ్వలేదని విదేశాంగ శాఖ తెలిపింది.

వీరిద్దరూ కలిసి ఆరిఫ్ ఇమాముద్దీన్ అనే ఇండియన్ ను హత్య చేశారన్న అభియోగాలపై డిసెంబర్ 9, 2015న అరెస్ట్ అయ్యారని, వీరి కేసు విచారణను ఎంబసీ అధికారులు పరిశీలించారని వెల్లడించిన ఓ అధికారి, కనీసం వారి మృతదేహాలనైనా అప్పగించాలని పలుమార్లు సౌదీని కోరామని, కానీ, మరణదండన విధించబడిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగించేందుకు అక్కడి చట్టాలు అంగీకరించబోవని విదేశాంగ శాఖ స్పష్టం చేసిందని తెలిపింది.

  • Loading...

More Telugu News