sidhu: ముస్లింలను ఉద్దేశించి వ్యాఖ్యలు.. సిద్ధూపై ఎఫ్ఐఆర్ నమోదు
- బీహార్ కతియార్ జిల్లాలో సిద్దూ ప్రచారం
- ఒవైసీలాంటి వారి వలలో పడవద్దని సూచన
- ముస్లింలు బలాన్ని గుర్తెరిగి ఓటు వేయాలంటూ పిలుపు
పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బీహార్ లోని కతియార్ జిల్లాలో ప్రచారం చేస్తూ... ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఈసీ ఆయనపై చర్యలు తీసుకుంది. కతియార్ జిల్లాలో సోమవారం ప్రచారం చేస్తూ... ఇక్కడ 64 శాతం మంది ముస్లింలు ఉన్నారని, ఒవైసీలాంటి వారి వలలో పడకుండా మీ బలాన్ని గుర్తెరిగి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి తారిక్ అన్వర్ కు ఓటు వేయాలని చెప్పారు. ఒవైసీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని అన్నారు. ప్రధాని మోదీని ఓడించాలని పిలుపునిచ్చారు.
దీనిపై బీజేపీ నేతలు స్పందిస్తూ, సిద్ధూ వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని విమర్శించారు. చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. సిద్ధూ వ్యాఖ్యలు మీడియాలో కూడా రావడంతో ఈసీ స్పందించింది. కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.