Kanimozhi: కనిమొళి ఇంట్లో ఏమీ దొరకలేదట... 'తప్పుడు సమాచారం ఇచ్చారు' అంటూ వెళ్లిపోయిన ఐటీ అధికారులు!
- నిన్న రాత్రి కనిమొళి ఇంట్లో దాడులు
- ఉత్త చేతులతో వెళ్లిపోయిన అధికారులు
- కేసు నమోదు చేయలేదన్న ఐటీ
తమిళనాడులో డీఎంకే నేత కనిమొళి ఇంట్లో జరిగిన ఆదాయపు పన్ను అధికారుల సోదాల్లో ఏమీ లభించలేదు. తూత్తుక్కుడి లోని ఆమె ఇంట్లో కోట్ల కొద్దీ డబ్బును దాచారని, ఎన్నికల్లో వాడేందుకు ప్రయత్నిస్తున్నారని అధికారులకు సమాచారం అందడంతో అధికారులు దాడి చేశారు. అయితే, సోదాల అనంతరం అధికారులు ఉత్త చేతులతో వెళుతూ, తమకు తప్పుడు సమాచారం అందిందని వ్యాఖ్యానించడం గమనార్హం. దాడి తరువాత కనిమొళిపై ఎటువంటి కేసునూ నమోదు చేయలేదని అధికారులు స్పష్టం చేశారు.
కాగా, ఈ సోదాలపై స్పందించిన కనిమొళి, ఎన్నికల కమిషన్, ఆదాయపు పన్ను శాఖ మోదీ కూటమిలో భాగమయ్యాయని ఆరోపించారు. విపక్ష పార్టీలను భయభ్రాంతులకు గురి చేయడమే మోదీ ఉద్దేశమని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ తమిళసై సౌందరరాజన్ ఇంట్లో కోట్ల కొద్దీ డబ్బు ఉందని, ఆమె ఇంట్లో దాడులు ఎందుకు జరగడం లేదని కనిమొళి ప్రశ్నించారు. కాగా, రెండో దశలో భాగంగా తమిళనాడులోని 39 లోక్ సభ, 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు గురువారం నాడు జరగనున్న సంగతి తెలిసిందే.