Ontimitta: ఒంటిమిట్టలో పున్నమి వెలుగుల కల్యాణానికి సర్వం సిద్ధం... వచ్చిన వారందరికీ ముత్యాల తలంబ్రాల కానుక!
- గురువారం రాత్రి ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణం
- పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు
- లక్షమందికి పంచేందుకు 3 లక్షల ముత్యాల తలంబ్రాలు రెడీ
కడప జిల్లా ఒంటిమిట్టలో వేంచేసివున్న కోదండ రామస్వామి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం రాత్రి పున్నమి చంద్రుని వెలుగుల్లో స్వామి, అమ్మవార్ల కల్యాణం జరుగనుంది. ఇప్పటికే కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదోరోజున స్వామి మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు.
నేటి రాత్రి గరుడ వాహన సేవ, రేపు రాత్రి కల్యాణం జరగనున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది. గురువారం రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య కల్యాణం జరుగనుంది. గత సంవత్సరం కల్యాణం సమయంలో భారీ వర్షం కురిసి, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో, ఈ దఫా ఎంత వర్షం వచ్చినా కార్యక్రమానికి ఆటంకం కలుగకుండా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. కల్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు కూడా హాజరు కానున్నారు. ఆయన ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు.
కల్యాణానికి దాదాపుగా లక్ష మంది వరకూ భక్తులు హాజరు కావచ్చని అంచనా వేస్తున్న అధికారులు, మూడు లక్షల ముత్యాల తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. వీటిని చిన్న చిన్న ప్యాకెట్లలో ఉంచి స్వామివారి కానుకగా, ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామని తెలిపారు. మొత్తం 150 కౌంటర్లను ఏర్పాటు చేసి వీటిని పంపిణీ చేస్తామని ప్రకటించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా 6 లక్షల వాటర్ ప్యాకెట్లు, 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లను సిద్ధం చేసినట్టు టీటీడీ ప్రకటించింది.