Jagan: ఆ కోడెల అనే వ్యక్తి ఇంత చేస్తే నేరం కాదా?: గవర్నర్ ను కలిసిన అనంతరం వైఎస్ జగన్
- ఇనుమెట్ల ఘటనపై గవర్నర్ కు ఫిర్యాదు
- తనంతట తానుగా చొక్కాలు చించుకొచ్చి డ్రామాలు
- బాధితులపైనే కేసులు పెడుతున్నారని గవర్నర్ కు ఫిర్యాదు
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ ఉదయం గవర్నర్ ను కలిసిన తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన, ఇనుమెట్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి కోడెల వెళ్లి, లోపల అధికారులు ఉండగానే, తలుపులు బిగించుకున్నారని, ఈ విషయం రికార్డెడ్ గా ఉందని, అక్కడున్న సాధారణ ఓటర్లు ఆయన వైఖరిని ప్రశ్నిస్తే, తనంతటతానుగా బట్టలు చించుకుని బయటకు వచ్చి డ్రామాలు ఆడారని ఆరోపించారు. కోడెల ఇంత చేస్తే, అదేమీ నేరం కాదన్నట్టు ఇంతవరకూ కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులపై టీడీపీ గూండాలు దాడులకు దిగుతున్నారని, ఇదే విషయాన్ని తాను గవర్నర్ కు ఫిర్యాదు చేశానని జగన్ వ్యాఖ్యానించారు.
ఎన్నికలకు ముందు తమకు నచ్చిన పోలీసు అధికారులకు, తమ కులం వారికి ప్రమోషన్లు ఇచ్చారని, దాని ఫలితంగానే ఇప్పుడు బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడిందని, గవర్నర్ కల్పించుకోవాలని తమ పార్టీ కోరిందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా దిగజారాయన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని జగన్ తెలిపారు. మచిలీపట్నంలో స్ట్రాంగ్ రూమ్ తలుపులను ఎందుకు తీయాల్సి వచ్చిందని ప్రశ్నించిన జగన్, అన్ని స్ట్రాంగ్ రూముల భద్రతనూ కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీసీ కెమెరాల లైవ్ ఫీడ్ ను కేంద్ర ఎన్నికల అధికారుల కార్యాలయాలకు అందించాలని కోరామని అన్నారు.