ajay agarwal: బీజేపీకి 40 సీట్లు కూడా రావు: మోదీకి ఒకప్పటి సన్నిహితుడు అజయ్
- 28 ఏళ్లుగా మోదీ నాకు తెలుసు
- నా వల్లే గుజరాత్ లో బీజేపీ గెలిచింది
- బీజేపీ కార్యకర్తలను మోదీ బానిసలుగా చూస్తున్నారు
ప్రధాని మోదీకి ఒకప్పటి సన్నిహితుడు, సుప్రీంకోర్టు న్యాయవాది అజయ్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలు సక్రమంగా, స్వేచ్ఛగా జరిగితే బీజేపీకి 40 సీట్లు కూడా రావని అన్నారు. మోదీ తనకు 28 ఏళ్లుగా తెలుసని, బీజేపీ ఢిల్లీ ఆఫీసులో ఇద్దరం కలసి కొన్ని వందల సార్లు భోజనం చేశామని చెప్పారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గెలుపొందడానికి తానే కారణమని... మణిశంకర్ అయ్యర్ నివాసంలో పాకిస్థాన్ అధికారులతో మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లు సమావేశమైన విషయాన్ని తానే వెల్లడించానని... ఈ సమావేశాన్ని దేశ భద్రతకు ముడిపెడుతూ గుజరాత్ ఎన్నికల్లో మోదీ విస్తృత ప్రచారం చేసుకొని, గెలుపొందారని చెప్పారు.
మణిశంకర్ అయ్యర్ ఉదంతాన్ని బయటపెట్టినందుకు గుజరాత్ బీజేపీ కీలక నేతలంతా తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని... గుజరాత్ లో బీజేపీ ఓటమి ద్వారా మోదీ, అమిత్ షాలకు గర్వభంగం చేద్దామని తాము తలచామని వారు తనతో చెప్పారని అజయ్ తెలిపారు. గుజరాత్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం మీరు ఎంత తాపత్రయపడ్డా, మీకు ఎలాంటి పదవులు రావని... మోదీ కృతజ్ఞత లేని వ్యక్తి అని వారు తనతో అన్నారని చెప్పారు. నోట్ల రద్దు సమయంలో దేశ వ్యాప్తంగా జరుగుతున్న దందాను తాను వెలుగులోకి తెస్తే... మోదీ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలను మోదీ బానిసలుగా చూస్తున్నారని దుయ్యబట్టారు. కుంభకోణాలకు పాల్పడి తమ త్యాగాలకు అర్థం లేకుండా చేస్తున్నారని అన్నారు.
2014 ఎన్నికల్లో రాయ్ బరేలీలో సోనియాగాంధీపై అజయ్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన 1.73 లక్షల ఓట్లను సాధించారు. ఈ సారి ఆయనకు బీజేపీ అధిష్ఠానం టికెట్ నిరాకరించింది. దీంతో, ఆయన ఆగ్రహంతో మోదీకి బహిరంగ లేఖ రాశారు.