CEC: కోడ్ అమలులో.. ఈసీ పనితీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి... ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ
- అధికారుల సమాధానంపై సంతృప్తి చెందని కోర్టు
- రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం
- విధుల నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోందని వ్యాఖ్య
ఎన్నికల వేళ కోడ్‌ను కచ్చితంగా అమలు చేసే విషయంలో అధికారుల సేవలను వినియోగించు కోవడంలో ఎన్నికల సంఘం విఫలమవుతున్నట్లు కనిపిస్తోందని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మాజీ ముఖ్యమంత్రి మాయావతిలు మతపరమైన వ్యాఖ్యలు చేశారంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ సందర్భంగా కోడ్ అమలు చేయడంలో ఈసీ పనితీరుపై దృష్టిసారించిన కోర్టు ఎన్నికల అధికారుల వివరణ కోరింది. దీనిపై ఈసీ సమాధానం ఇస్తూ నేతల వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని కోర్టుకు తెలిపింది. దీనిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారుల సేవలను వినియోగించు కోవడంలో ఈసీ విఫలమవుతోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈసీ తరపున పూర్తి వివరాలతో ఓ అధికారిని రేపు కోర్టుకు పంపాలని సుప్రీం ఆదేశించింది.