railway ticket: రైలు టికెట్‌పై మోదీ ఫొటో... ఓ ప్రయాణికుడి అభ్యంతరం.. వివరణ ఇచ్చిన రైల్వే!
- మీడియా దృష్టికి తేవడంతో లెంపలేసుకున్న రైల్వే శాఖ
- ఎన్నికల నేపథ్యంలో బ్యాన్ చేసిన సీఈసీ
- అయినా కొనసాగుతుండడంపై అభ్యంతరం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైలు టికెట్లపై ఇంకా ప్రధాని మోదీ ఫొటో ఉండడంపై ఓ ప్రయాణికుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఎన్నికల సంఘం దీన్ని బ్యాన్ చేసినా అధికారులు కొనసాగిస్తున్నారంటూ అతను మీడియా ముందుకు తీసుకువచ్చాడు. వివరాల్లోకి వెళితే...ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ షబ్బర్ రిజ్వీ అనే యువకుడు లక్నో నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని బారాబంకీకి ఆదివారం టికెట్టు బుక్ చేసుకున్నాడు.
అయితే, ఆయనకు ఇచ్చిన టికెట్ వెనుక ప్రధాని మోదీ ఫొటో, ప్రధాన మంత్రి ఆవాస్ (రూరల్) యోజన పథకం వివరాలు ప్రింట్ చేసి ఉన్నాయి. ఇలా ఉండడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని గుర్తించిన రిజ్వీ విషయాన్ని రైల్వే అధికారులకు తెలియజేయగా వారు పట్టించుకోలేదు. దీంతో అతను విషయాన్ని మీడియా ముందు బయటపెట్టాడు.
దీంతో దిగివచ్చిన రైల్వే అధికారులు పొరపాటున మోదీ ఫొటో ఉన్న పేపర్ రోల్ మిషన్‌లో పెట్టడంతో ఇలా జరిగిందంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత తొలుత తృణమూల్ కాంగ్రెస్ రైలు టికెట్లపై మోదీ ఫొటో ఉండడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రైల్వేశాఖ ఈ టికెట్లను ఉపసంహరించుకున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించింది. కానీ ఆదివారం మళ్లీ బయటపడడంతో వివాదం అయ్యింది.