Uttar Pradesh: జయప్రదపై నోరుపారేసుకున్న ఆజంఖాన్‌పై పోలీసుల కేసు నమోదు

  • మహిళా కమిషన్‌ లేఖపై స్పందించిన ఈసీ
  • ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ
  • రాంపూర్‌లో ఖాన్‌తో తలపడుతున్న జయప్రద

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా తనతో తలపడుతున్న సినీనటి జయప్రదపై నోరు పారేసుకున్న ఆమె ప్రత్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్‌పై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నియోజకవర్గంలో నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆజంఖాన్‌ జయప్రదపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ‘జయప్రదను రాంపూర్‌ తీసుకువచ్చింది నేను, ఇక్కడి వీధుల్లో ప్రజలకు పరిచయం చేసింది నేను, ఆమె జోలికి ఎవరూ రాకుండా చూసుకున్నది నేను. కానీ ఆమె నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది. ఆమె ఖాకీ నిక్కరు వేసుకుంది’ అంటూ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యల్లో ఆమె ఖాకీ నిక్కరు వేసుకున్నారన్న వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. ఒక మహిళను కించపరుస్తూ ఆయన మాట్లాడారని పలువురు దుమ్మెత్తిపోశారు. మహిళా కమిషన్‌ కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించి ఈసీకి లేఖ రాసింది. ఈ లేఖపై స్పందించిన ఎన్నికల సంఘం ఆజంఖాన్‌కు నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

ఇంత జరిగినా ఆజంఖాన్‌ ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ‘తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసు. ఏ వ్యక్తినీ ఉద్దేశించి అవమానించాలని నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అలా చేసినట్టు నిరూపిస్తే ఎన్నికల రంగం నుంచి తప్పుకుంటాను’ అంటూ వ్యాఖ్యానించారు.

మరోవైపు ఆజంఖాన్‌ వ్యాఖ్యలపై జయప్రద మండిపడ్డాడు. గతంలోనూ అతను ఇలాంటి వ్యాఖ్యలు చాలాచేశాడు. ఇటువంటి వ్యక్తులు గెలిస్తే సమాజానికే ప్రమాదం అని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నేను భయపడి వెళ్లిపోతానని ఆజంఖాన్‌ అనుకుంటున్నాడేమోగాని, అటువంటిదేం జరగదని, ఇక్కడే తానుంటానని స్పష్టం చేశారు.

Uttar Pradesh
azamkhan
jayaprada
CEC
police case
  • Loading...

More Telugu News