Hariprasad: ఈవీఎంను హ్యాక్ చేయవచ్చని చూపిస్తే, దొంగతనం కేసు పెట్టారు: ఏపీ సాంకేతిక సలహాదారు హరిప్రసాద్ ఆవేదన
- కేసు విచారణ ఎంతవరకూ వచ్చిందో తెలియదు
- నాకు ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ అవార్డు కూడా వచ్చింది
- కేసుతో అవమానకరంగా ఫీలయ్యానన్న హరిప్రసాద్
తాను 2010లో ఈవీఎంలను హ్యాకింగ్ చేసి చూపిస్తే, తాను వాటిని దొంగిలించినట్టు తప్పుడు కేసు పెట్టారని ఏపీ సాంకేతిక సలహాదారు వేమూరు హరిప్రసాద్ ఆరోపించారు. ప్రస్తుతం తనపై నమోదైన కేసు విచారణ ఎంతవరకూ వచ్చిందో కూడా తనకు తెలియదని అన్నారు. తనపై ఈవీఎం దొంగతనం కేసు పెట్టారని తెలుసుకున్న తరువాత తానెంతో అవమానకరంగా భావించానని అన్నారు.
2010లో తనకు అంతర్జాతీయ సమాజం ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్ పయనీర్ అవార్డును ఇచ్చి సత్కరించిందని గుర్తు చేసిన హరిప్రసాద్, ప్రస్తుతం వినియోగిస్తున్న ఎం3 వర్షన్ ఈవీఎంలను సైతం హ్యాక్ చేసి చూపించవచ్చని అన్నారు. వీవీప్యాట్ యంత్రాల పనితీరు సైతం అనుమానాస్పదంగానే ఉందని ఆరోపించిన ఆయన, ఏడు సెకన్లపాటు కనిపించాల్సిన ప్రింట్, మూడు సెకన్లు మాత్రమే కనిపిస్తోందని అన్నారు. దీనిప్రకారం, ఈవీఎం, వీవీప్యాట్ లలోనే ఒరిజినల్ సాఫ్ట్ వేర్ కోడ్ మారిందని తెలుస్తోందని, దీనిప్రకారం వాటిని కూడా హ్యాక్ చేయవచ్చని భావించవచ్చని అన్నారు.
అయితే, తాజా ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఎన్నికల ఫలితం ప్రభావితం అవుతుందా? అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెప్పకపోవడం గమనార్హం. ఎన్నికల ఫలితాలు ప్రభావితం అవుతాయని భావించడం లేదని, ఎవరైనా నిజంగా ట్యాంపర్ చేస్తేనే అది జరుగుతుందని అన్నారు.