akhilesh yadav: విదేశీ పత్రికల్లో ఇలాంటి వార్తలు రాకూడదనే మహాకూటమి ఏర్పాటు: అఖిలేశ్ యాదవ్

  • రాజ్యాంగ పరిరక్షణ కోసమే మహాకూటమి ఏర్పాటు
  • మోదీ మేకిన్ ఇండియా అంటూనే ఆయన స్నేహితులకు విదేశీ కాంట్రాక్టులు
  • జవాన్లు ఉన్నంత వరకు దేశ సరిహద్దులు భద్రంగా ఉంటాయి

మహాకూటమి ఏర్పాటు వెనక ఉద్దేశాన్ని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వెల్లడించారు. దేశాన్ని అవమానిస్తూ విదేశీ దిన పత్రికల్లో వార్తలు వచ్చే పరిస్థితులను నిలువరించడానికే మహాకూటమిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం అనంతరం ఫ్రాన్స్‌లోని రిలయన్స్ కమ్యూనికేషన్ అనుబంధ సంస్థకు 143.7 మిలియన్‌ యూరోల మేర పన్నులు రద్దు చేసినట్లు ఆ దేశానికి చెందిన ‘లీ మాండె’ అనే దినపత్రిక ప్రచురించిన వార్తతో దేశంలో ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అఖిలేశ్ పై విధంగా స్పందించారు.

ప్రధాని నరేంద్రమోదీపైనా ఆయన విమర్శలు గుప్పించారు. మోదీ ‘మేకిన్ ఇండియా’ అంటూనే విదేశాల నుంచి కొనుగోళ్ల కోసం తన స్నేహితులకు కాంట్రాక్టులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు చెబుతున్నట్టు ఆ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం దేశ సరిహద్దులు సురక్షితంగా ఉంటాయన్న వ్యాఖ్యలను అఖిలేశ్ యాదవ్ తప్పుబట్టారు. వారి వ్యాఖ్యలు సరికాదని, జవాన్లు ఉన్నంతకాలం దేశ సరిహద్దులు సురక్షితంగా ఉంటాయని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణకే మహాకూటమి ఏర్పాటైందని అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News