Soujanya: ప్రేమకు అడ్డు వస్తోందని తల్లిపై దాడి.. అడ్డు వచ్చిన కూతురిపై కూడా.. తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్న యువకుడు!
- స్రవంతినగర్‌లో ఉంటున్న శ్రీనివాసరెడ్డి
- తల్లితో కలిసి ఉంటున్న సౌజన్య
- సౌజన్యకు ప్రేమ పేరుతో వేధింపులు
- తన కూతురిని వదిలేయాలని వేడుకున్న సుజాత
తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో యువతితో పాటు ఆమె తల్లిపై దాడి చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వైజాగ్‌కు చెందిన శ్రీనివాసరెడ్డి(31) తన స్నేహితులతో కలిసి హైదరాబాద్, జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని స్రవంతి నగర్‌లో అద్దెకుంటున్నాడు. అదే ప్రాంతంలో తన తల్లి సుజాతతో కలిసి తమిళనాడుకు చెందిన సౌజన్య(26) నివాసముంటోంది. శ్రీనివాసరెడ్డి, సౌజన్య ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌజన్యను ప్రేమిస్తున్నానంటూ కొంతకాలంగా శ్రీనివాసరెడ్డి వేధిస్తున్నాడు.
ఆమె తిరస్కరిస్తుండటంతో నిన్న రాత్రి 8 గంటల సమయంలో స్క్రూ డ్రైవర్ జేబులో పెట్టుకుని సౌజన్య ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో సౌజన్య ఇంట్లో లేకపోవడంతో ఆమె తల్లికి విషయం చెప్పి తన ప్రేమకు అడ్డురావొద్దని హెచ్చరించాడు. అయితే, అందుకు ఆమె అభ్యంతరం చెప్పి, తన కూతురును ప్రశాంతంగా బతకనివ్వాలని సుజాత వేడుకుంది. దీంతో తమ ప్రేమకు ఆమె అడ్డు వస్తోందని భావించిన శ్రీనివాసరెడ్డి ఆగ్రహంతో స్క్రూ డ్రైవర్‌తో ఆమెపై దాడి చేశాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన సౌజన్య, తల్లిపై దాడిని అడ్డుకుంది. ఈ ఘటనలో ఆమెకు కూడా గాయాలయ్యాయి.
తల్లీకూతుళ్ల అరుపులు విన్న చుట్టుపక్కల వారు వచ్చేసరికి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే సౌజన్య, ఆమె తల్లిని స్థానికులు మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే దాడి చేసిన వెంటనే శ్రీనివాసరెడ్డి సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నేటి ఉదయం జూబ్లీహిల్స్ ఎస్‌ఐ సుధీర్‌రెడ్డి నిందితుడి కాల్ డేటా ఆధారంగా దానిలోని నంబర్‌కు ఫోన్ చేయగా అది శ్రీనివాసరెడ్డి సోదరుడిదిగా తేలింది. తన సోదరుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించాడు.