Narendra Modi: భారత్ ను ముక్కలు చేయడానికి ఆ రెండు కుటుంబాలను ఏమాత్రం అనుమతించను: మోదీ

  • అబ్దుల్లాలు, ముఫ్తీలు కశ్మీర్ ను నాశనం చేశారు
  • మూడు తరాలుగా కశ్మీర్ లో అరాచకం ప్రబలింది
  • జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత భూభాగమే

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దేశంలో తొలి విడత ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో మిగిలిన ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆయన జమ్మూకశ్మీర్ లో భారీ బహిరంగ సభలో పాల్గొని ఆవేశపూరితంగా ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన సాయుధ బలగాలకు చెందిన అమరజవాన్లకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ జవాన్లను అవమానిస్తోందంటూ విపక్షంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ తన వ్యాఖ్యలతో సాయుధ బలగాల ఆత్మస్థయిర్యాన్ని నీరుగారుస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాగాకుండా, స్థానిక రాజకీయ అంశాలను కూడా ప్రస్తావిస్తూ, అబ్దుల్లాలు, ముఫ్తీలు జమ్మూకశ్మీర్ ను సర్వనాశనం చేశారంటూ మండిపడ్డారు.

ఆ రెండు కుటుంబాలు మూడు తరాలుగా కశ్మీర్ ను భ్రష్టుపట్టించాయని అన్నారు. కశ్మీర్ కు ప్రత్యేకంగా ఓ ప్రధానమంత్రి ఉండాలంటూ ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేయడాన్ని మోదీ ఈ సందర్భంగా తప్పుబట్టారు. దేశాన్ని ముక్కలు చేయడానికి ఆ రెండు కుటుంబాల ప్రయత్నాలను ఏమాత్రం అనుమతించబోనని తీవ్రస్వరంతో వ్యాఖ్యానించారు. కశ్మీర్ ఎప్పటికీ భారత భూభాగమేనని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News