nizamabad loksabha constituency: ఓట్ల లెక్కింపు ప్రారంభమైన ఒక రోజు తర్వాతే నిజామాబాద్‌ లోక్ సభ ఫలితం

  • గరిష్ఠంగా 30 గంటలు పడుతుందన్న అధికారులు
  • ఇక్కడ బరిలో 185 మంది అభ్యర్థులు
  • 12 బ్యాలెట్‌ యూనిట్లతో పోలింగ్‌ నిర్వహణ

తెలంగాణలోని నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం ఎన్నికల ఫలితం అన్నింటికంటే ఆలస్యంగా ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఇక్కడ మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభించాక కనీసం ఒక రోజైనా సమయం పడుతుందని భావిస్తున్నారు. అంటే 24వ తేదీన ఫలితం వెలువడనుంది.

 ఈ నియోజకవర్గంలో భారీ స్థాయిలో రైతులు నామినేషన్‌ వేసిన విషయం తెలిసిందే. సర్కారు తీరుపై ఆగ్రహించిన అన్నదాతలు బ్యాలెట్‌ బాక్సింగ్‌లో తమ సత్తాచాటాలన్న ఉద్దేశంతో భారీ సంఖ్యలో నామినేషన్‌లు దాఖలు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో ఎన్నికల కోసం 12 ఈవీఎం యూనిట్లు వినియోగించారు. నోటాతో కలిపి మొత్తం 186 గుర్తులు ఉంటాయి. నియోజకవర్గంలో మొత్తం 1788 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఈ లోక్‌సభ నియోజకవర్గంలో నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌, ఆజ్‌మూర్‌, బోధన్‌, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపును జగిత్యాల జిల్లా కేంద్రంలోను, మిగిలిన సెగ్మెంట్ల ఓట్లను డిచ్‌పల్లిలోని క్రిస్టియన్‌ వైద్యకళాశాల భవనంలోను లెక్కిస్తారు.

అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా 14 టేబుళ్లు నిర్వహించగా ఈసారి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 18 టేబుళ్లు వినియోగిస్తున్నారు. 12 బ్యాలెట్‌ యూనిట్లు ఉపయోగించినందున  ఒక్కో టేబుల్‌పై 216 బ్యాలెట్‌ యూనిట్లు ఉంచి లెక్కించాల్సి ఉంటుంది. ఇందుకు ఎక్కువ స్థలం, ఎక్కువ సమయం కూడా అవసరం. అభ్యర్థుల వారీగా పడిన ఓట్లు లెక్క తేలాలంటే నోటా వరకు వరుస క్రమంలో అందరికీ పడిన ఓట్లు లెక్కించుకు రావాలి. ఇందుకు ఎక్కువ సమయం పడుతుంది.

మాక్‌పోలింగ్‌ సమయంలోనే ఒక పోలింగ్‌ కేంద్రంలో 186 గుర్తులు నొక్కి పరిశీలించేందుకు రెండు గంటల సమయం పట్టిందని అధికారులు తెలిపారు. అంటే 1788 పోలింగ్‌ కేంద్రాల ఓట్లను అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా విభజించి లెక్కించాలంటే ఇంకా ఎక్కువ సమయం పడుతుందని ఎన్నికల అధికారులు  చెబుతున్నారు.

మొత్తం నియోజక వర్గం ఓట్లను 14 రౌండ్లుగా విభజించి ఒక్కో రౌండ్‌లో 126 కేంద్రాల ఓట్లను లెక్కించనున్నారు. ఇలా ఒక రౌండ్‌ పూర్తయ్యేందుకు కనీసం రెండు గంటల సమయం పడుతుందని, ఆ లెక్కన ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి గరిష్టంగా 30 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News