Azam Khan: నేను మిమ్మల్ని అన్నా అంటే.. మీరు నన్ను నాట్యకత్తె అంటారా?: ఆజంఖాన్ పై జయప్రద ఫైర్
- ఇటీవలే బీజేపీలో చేరిన జయప్రద
- రాంపూర్ నుంచి ఆజంఖాన్‌పై పోటీ
- ఆజంఖాన్ వ్యాఖ్యలు తనను బాధించాయన్న జయప్రద
ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రముఖ సినీ నటి జయప్రద ఎస్పీ నేత ఆజంఖాన్ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. అతడిని తన సోదరుడిలా భావించానని, అన్నా అని పిలిచేదానినని గుర్తు చేశారు. అయితే, అతను మాత్రం తనను డ్యాన్సులు వేసుకునే మహిళగా పిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకనే తాను ఇంతకుముందు రాంపూర్‌ను వదిలిపెట్టాలని అనుకున్నానని జయప్రద పేర్కొన్నారు.
రాంపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జయప్రద మాట్లాడుతూ.. ‘‘ఆజంఖాన్ గారూ, నేను మిమ్మల్ని సోదరుడిలా భావించా. అన్నా అని పిలిచా. కానీ, మీరు నన్ను డ్యాన్సర్‌గా పిలిచి అవమానించారు. మీ వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయి. అందుకనే రాంపూర్ ను విడిచి వెళ్లిపోవాలనుకున్నాను’’ అని జయప్రద పేర్కొన్నారు.
అసభ్యకరంగా ఉన్న తన ఫొటోలు అప్పట్లో రాంపూర్‌లో వైరల్ అయ్యాయని పేర్కొన్న జయప్రద.. తనకు సాయం చేయాల్సిందిగా ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌ను కోరానని, అయినప్పటికీ ఏ రాజకీయ నాయకుడు తనకు అండగా నిలవలేదన్నారు. అప్పట్లో తాను ఈ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడానికి ఇదే కారణమని జయప్రద వివరించారు.