KCR: తమను ఎలాగైనా కాపాడాలంటూ చినజీయర్ స్వామికి మొరపెట్టుకున్న తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు
- రెవెన్యూ శాఖ విలీనం, రద్దు ఆలోచనలు వద్దు
- మార్పులు చేస్తే సరిపోతుంది
- కేసీఆర్ ను కలిసే వీల్లేకపోవడంతో చినజీయర్ ను కలిశాం
తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామిని కలిసి తమ గోడు వెళ్లబోసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రెవెన్యూ శాఖ విలీనం ప్రతిపాదన విరమించుకోవాలని, రద్దు ఆలోచనలు చేయొద్దని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చినజీయర్ ను కలిసిన రెవెన్యూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమను ఎలాగైనా కాపాడాలని కోరారు. సీఎం కేసీఆర్ ను కలిసి తమ ఆవేదన వెలిబుచ్చుదామనుకుంటే అనుమతి లభించడంలేదని వాపోయారు.
గత కొన్నిరోజులుగా రెవెన్యూ శాఖ రద్దుపై ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని వీఆర్వోల సంఘం ప్రతినిధులు తెలిపారు. రెవెన్యూ శాఖను రద్దు చేయడం కంటే మార్పులు చేస్తే బాగుంటుందని అన్నారు. తెలంగాణ రెవెన్యూ శాఖకు 200 ఏళ్ల చరిత్ర ఉందని, ఇప్పుడు రద్దు చేయడం సరికాదని పేర్కొన్నారు. కేసీఆర్ ను కలవడానికి విఫలయత్నాలు చేశామని, అందుకే తమను ఆదుకుంటారన్న ఉద్దేశంతో చినజీయర్ స్వామిని కలిశామని రెవెన్యూ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.