Narendra Modi: అది 'మహాకల్తీ' కూటమి... దాంట్లో అందరూ ప్రధానులే!: మోదీ వ్యంగ్యం
- కూటమిలో రాహుల్ ఏకాకి
- అవినీతి పార్టీలు ఏకమయ్యాయి
- కూటమి కుళ్లుకుంటోంది
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యర్థులపై ధ్వజమెత్తారు. తమిళనాడులోని తేని ప్రాంతంలో మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, బీజేపీ నాయకత్వంలో దేశం పురోగతి సాధిస్తుండడం చూసి విపక్ష కూటమి ఓర్వలేకపోతోందని అన్నారు.
తమిళనాడులో డీఎంకేతో కలిసి ఏర్పాటు చేసింది మహాకల్తీ కూటమి అని విమర్శించారు. డీఎంకే చీఫ్ స్టాలిన్ ప్రధానిగా రాహుల్ గాంధీని ప్రతిపాదిస్తే కూటమిలోని ఇతర నేతలు అంగీకరించడంలేదని, ఆ కూటమిలో అందరూ ప్రధాని అవ్వాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కూటమిలో ఉన్న పార్టీలన్నింటికి అవినీతి చరిత్ర ఉందని ఆరోపించిన మోదీ, గతంలో తీవ్రంగా అవమానించిన కాంగ్రెస్ తో ఆ పార్టీలన్నీ జట్టుకట్టాయని విమర్శించారు. "ఇప్పుడు న్యాయం జరుగుతుంది" అంటూ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని, అంటే, 60 ఏళ్ల వారి పాలనలో న్యాయం జరగలేదనే కదా అర్థం అంటూ కొత్త భాష్యం చెప్పారు.