Andhra Pradesh: బ్యాలెట్ పేపర్లనే 16-18 గంటల్లో లెక్కిస్తారు.. వీవీప్యాట్ కు 6 రోజులు పడుతుందా?: సీఎం చంద్రబాబు
- నేడు ఢిల్లీలో సీఈసీ సునీల్ ఆరోరాతో భేటీ
- ఏపీలో పరిస్థితులపై 18 పేజీల లేఖ అందజేత
- మోదీ డైరెక్షన్ లో ఈసీ పని చేస్తోందన్న టీడీపీ అధినేత
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తలెత్తిన పరిస్థితులపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు అంశాలపై ఆయనకు బాబు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అరోరాకు 18 పేజీల లేఖ అందజేసిన అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘భారత్ గొప్ప ప్రజాస్వామ్య దేశం. కాబట్టి ఈ దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉంది. ఈవీఎంల పనితీరుపై మేం చాలాకాలంగా ఆందోళన చేస్తున్నాం’ అన్నారు చంద్రబాబు. అయితే, ప్రధాని మోదీ డైరెక్షన్ లో ఈసీ పనిచేస్తోందని మండిపడ్డారు.
ఓటర్ల ప్రాథమిక హక్కును కాపాడటంలో ఈసీ ఘోరంగా విఫలమయిందని దుయ్యబట్టారు. దీనిపై ఈసీ వద్ద సమాధానం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందే ఈవీఎంల పనితీరుపై తాము ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. తాము మాత్రమే కాకుండా దేశంలోని 22 రాజకీయ పార్టీలు ఈవీఎంలపై ఫిర్యాదు చేశాయని గుర్తుచేశారు. 50 శాతం వీవీప్యాట్ యంత్రాల స్లిప్పులను లెక్కించాలంటే 6 రోజులు పడుతుందని ఈసీ చెప్పడాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు తప్పుబట్టారు. అసలు అంత సమయం పట్టదనీ, బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడే మహా అయితే కౌంటింగ్ 16-18 గంటల్లో పూర్తయ్యేదని గుర్తుచేశారు. ఎన్నికలకు ముందే ఓ కలెక్టర్, ఇద్దరు ఎస్పీలను ఈసీ బదిలీ చేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.