Andhra Pradesh: మే 23 తర్వాత చంద్రబాబును చినవాల్తేరులోని పిచ్చాసుపత్రికి తరలించాల్సి ఉంటుంది!: గుడివాడ అమర్నాథ్
- ఏపీలో ఏం చేశారని బాబు ఓట్లు అడుగుతున్నారు?
- ప్రజలు ఈవీఎంలో నొక్కాల్సిన చోటే నొక్కారు
- ఇది అర్థమై బాబు పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారు
ఆంధ్రప్రదేశ్ లో ఏం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఓట్లు అడుగుతున్నారని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఇప్పటివరకూ చంద్రబాబు ప్రతీఎన్నికల్లో ఇతరులతో పొత్తులు కుదుర్చుకునే ముందుకు వెళ్లారని విమర్శించారు. చంద్రబాబు 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని తీసి ప్రజల ముందు పెడితే నిబద్ధత, విశ్వసనీయత అనే పదాలు ఎక్కడా కనిపించవని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అమర్నాథ్ మాట్లాడారు.
చంద్రబాబు ఓడిపోతున్నారన్న విషయం ఆయన ముఖంలోనే ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ‘సెల్ ఫోన్ నేనే కనిబెట్టా. కంప్యూటర్ సైతం నేనే కనిబెట్టా. టెక్నాలజీని ఈ దేశంలోకి తెచ్చింది నేనే అని చెప్పుకుంటారు. అంతలోనే ఈవీఎం మెషీన్లలో ఓ గుర్తుకు నొక్కితే మరో గుర్తుకు పడిపోతుందని అంటున్నారు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అయితే, ఏపీ ప్రజలు నొక్కాల్సిన చోటే నొక్కారనీ, అది తెలుసుకున్న చంద్రబాబు పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కంటే అన్యాయంగా తయారయ్యారని దుయ్యబట్టారు. కేఏ పాల్ ను గతంలో ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించారన్న అమర్నాథ్.. మే 23న ఫలితాల తర్వాత చంద్రబాబును విశాఖపట్నంలోని చినవాల్తేరు పిచ్చాసుపత్రికి తరలించాల్సి ఉంటుందని జోస్యం చెప్పారు.