Sumalatha: కుమారస్వామి 'డ్రామా' వ్యాఖ్యలకు బదులిచ్చిన సుమలత
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-d323af17d145e9e658af081579ee3b9c7fdd66ba.jpg)
- దాడికి ముఖ్యమంత్రే కుట్ర పన్నారేమో
- కచ్చితంగా ఎలా చెప్పగలిగారు?
- తేదీ కూడా చెబుతున్నారంటే పథక రచన జరిగేవుంటుంది
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కర్ణాటక సీఎం కుమారస్వామి శైలే వేరు. తాజాగా ఆయన నటి సుమలతపై వ్యాఖ్యలు చేశారు. మాండ్య నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సుమలత ఈనెల 16న కొత్త నాటకానికి తెరలేపుతారని, త్వరలోనే తలకు కట్టుతో కనిపిస్తారని, సొంత కార్యకర్తలతోనే రాళ్ల దాడి చేయించుకుంటారని ఆరోపించారు. ప్రజల్లో సానుభూతి పెంచుకోవడం కోసమే సుమలత ఈ డ్రామాకు తెరదీస్తారని కుమారస్వామి చెప్పారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి. వీటిపై సుమలత ఘాటుగా స్పందించారు.
తాను తలకు కట్టుతో కనిపిస్తానని, నాటకానికి తెరలేపుతున్నానని ముఖ్యమంత్రి కుమారస్వామి ఎలా చెబుతారంటూ ప్రశ్నించారు. సీఎం మాటలు వింటుంటే ఆయనే తనపై కుట్ర పన్నినట్టుగా అనుమానం వస్తోందన్నారు. తేదీ కచ్చితంగా చెబుతుండడాన్ని బట్టి తనపై దాడికి పథక రచన జరిగుంటుంది అంటూ సందేహం వెలిబుచ్చారు.