Anantapur District: వీరాపురం ఘటనలో మరో టీడీపీ కార్యకర్త మృతి.. గ్రామంలో ఉద్రిక్తత
- చికిత్స పొందుతూ కన్నుమూత
- వీరాపురంలో భారీగా పోలీసుల మోహరింపు
- పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్న ఎస్పీ
ఏపీలో పోలింగ్ సందర్భంగా మునుపెన్నడూ లేనంతగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఫ్యాక్షన్ రాజకీయలకు పెట్టిందిపేరైన రాయలసీమలో ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ముఖ్యంగా, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం వీరాపురంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాల్చడం, ఆ ఘటనలో టీడీపీకి చెందిన సిద్ధా భాస్కర్ రెడ్డి, వైసీపీకి చెందిన పుల్లారెడ్డి మృతి చెందడం తెలిసిందే.
అయితే, ఆ ఘటనలో గాయపడిన టీడీపీ కార్యకర్త చింతా భాస్కర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మరణించాడు. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన దాడిలో చింతా భాస్కర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దాంతో వీరాపురంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులో ఉంచడానికి భారీగా పోలీసులను మోహరించారు. ముఖ్యంగా, టీడీపీ, వైసీపీ నేతల నివాసాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వీరాపురం చేరుకుని స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.