Kodela: నాపై అంత దారుణం జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారో అర్థంకాలేదు: కోడెల ఆవేదన

  • ఇనిమెట్లలో రీపోలింగ్ జరపాల్సిందే
  • నాపై దాడి వెనుక అంబటి కుట్ర
  • వైసీపీ అరాచకం సృష్టించింది

రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో హింసాత్మక సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. సాక్షాత్తు ఏపీ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుపై తీవ్రస్థాయిలో దాడి జరిగింది. ఇనిమెట్లలోని 106వ నంబర్ పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన కోడెలపై వైసీపీ కార్యకర్తలు ముష్టిఘాతాలతో విరుచుకుపడ్డారు. దాంతో ఆయన గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో, ఇనిమెట్ల 106 పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాల్సిందేనని కోడెల డిమాండ్ చేస్తున్నారు.

తనపై దాడికి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు, బాసు లింగారెడ్డి, రాజనారాయణ కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. తన రాక సందర్భంగా దౌర్జన్యకారులను రెచ్చగొట్టడం ద్వారా వైసీపీ అరాచకం సృష్టించిందని అన్నారు. కనీస భద్రత లేకుండా పోలింగ్ నిర్వహించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోడెల కోరారు. అంత దారుణం జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారో అర్థంకావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి ఘటనల ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి కేంద్రం ప్రయత్నించిందని మండిపడ్డారు. పోలింగ్ సందర్భంగా హింసకు ఎన్నికల సంఘం వైఖరే ప్రధాన కారణమని ఆరోపించారు.

  • Loading...

More Telugu News