chandrababu: రేపు ఢిల్లీకి వెళ్తున్నా.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తా: చంద్రబాబు
- వీవీ ప్యాట్ ల లెక్కింపుకు సంబంధించి సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తా
- దీనిపై జాతీయ స్థాయిలో పోరాడుతా
- ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తా
వీవీ ప్యాట్ ల లెక్కింపుపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయబోతున్నానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దీనికోసం రేపు ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పారు. వీవీ ప్యాట్ లలో స్లిప్పులను లెక్కించడానికి ఆరు రోజులు ఎలా పడుతుందని ప్రశ్నించారు. స్లిప్పులు లెక్కించడానికి ఆరు గంటలు కూడా మించదని అన్నారు. బ్యాలెట్ పత్రాలను లెక్కించేందుకు గతంలో ఎంత సమయం పట్టేదో గుర్తు చేసుకోవాలని సూచించారు. దీనిపై జాతీయ స్థాయిలో పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తానని... ఏపీలో ఎన్నికల నిర్వహణపై ప్రశ్నిస్తానని చంద్రబాబు తెలిపారు. ఈవీఎంలు మొరాయించినప్పుడు వచ్చిన సాంకేతిక నిపుణులు ఎవరు? వారికి ఉన్న అర్హతలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేస్తానని చెప్పారు. ఏకధాటిగా రెండు గంటల పాటు ఈవీఎం పని చేయకపోతే రీపోలింగ్ కు అవకాశముందని... అయినా ఈసీ పట్టించుకోవడం లేదని విమర్శించారు.