World Press Photo: ప్రతిష్ఠాత్మక అవార్డును పొందిన ఫొటో ఇదే!

  • ట్రంప్ వలసవాదంపై విమర్శలు తెచ్చిన చిత్రం
  • సరిహద్దుల్లో ఏడుస్తున్న బిడ్డ
  • జాన్ మూరేకు వరల్డ్ ప్రెస్ ఫోటో అవార్డు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వలసవాద విధానంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు తెచ్చేందుకు కారణమైన ఫొటోకు ప్రతిష్టాత్మక 'వరల్డ్‌ ప్రెస్‌ ఫొటో అవార్డు' లభించింది. మెక్సికో సరిహద్దుల్లో ఈ చిత్రాన్ని గెట్టీ ఫొటోగ్రాఫర్‌ జాన్‌ మూరే తీశారు. తమ దేశంలోకి ప్రవేశిస్తున్న వలసదారులను అడ్డుకుంటున్న పోలీసులు, ఓ మహిళను ప్రశ్నిస్తున్న వేళ, ఆమె కన్నబిడ్డ బిక్కమొహం వేసుకుని భయంతో ఏడుస్తున్న చిత్రమిది. వలసదారుల నుంచి వారి పిల్లలను వేరు చేసి, పంజరాల్లో బంధిస్తున్నారన్న విమర్శలను ట్రంప్ సర్కారు ఎదుర్కొందన్న సంగతి తెలిసిందే.

జాన్ మూరే తీసిన ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ కాగా, అమెరికా వైఖరిని పలు దేశాలు ప్రశ్నించాయి. గత సంవత్సరం జూన్ 12 అర్థరాత్రి, హూండరస్ కు చెందిన సాండ్రా సన్ చేజ్ అనే మహిళ, తన కుమార్తె యెనేలాతో పాటు అమెరికాలోకి వచ్చేందుకు ప్రయత్నించిన వేళ, ఈ ఫొటోను ఆయన తీశారు. యెనేలాను ఆమె నుంచి వేరు చేసి తీసుకెళ్లేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించిన వేళ, ఆమె అడ్డుకుంది. పోలీసులు, సాండ్రా మధ్య వాగ్వాదం జరుగుతుండగా, యెనేలా ఏడుపు లంఘించుకుంది.

ఇక అవార్డును తీసుకున్న సందర్భంగా మూరే మాట్లాడుతూ, శరణార్థుల కళ్లల్లోని భయాన్ని తాను కళ్లారా చూశానని, మానవత్వానికి మచ్చగా వలస విధానాలు మారాయని, తన ఫొటో ద్వారా పాలకులకు విభిన్నమైన స్టోరీని చెప్పాలని భావించానని, శరణార్థుల కష్టాలకు ఈ ఫొటో చిన్న ఉదాహరణ మాత్రమేనని అన్నారు. కాగా, మొత్తం 4,738 మంది ఫొటోగ్రాఫర్లు పంపిన 78,801 చిత్రాల నుంచి మూరే ఫోటోను ఎంపిక చేసి అవార్డును ఇచ్చినట్టు నిర్వాహకులు ప్రకటించారు.

World Press Photo
Award
Donald Trump
John Moore
  • Loading...

More Telugu News