visakha loksabha: విశాఖ లోక్‌సభ స్థానం ఎవరి పరం... క్రాస్‌ ఓటింగ్‌ జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణకు కలిసి వచ్చేనా?

  • చతుర్ముఖ పోటీలో ఆయన పట్లే మొగ్గంటున్న పరిశీలకులు
  • పార్టీ ఇమేజ్‌ కంటే వ్యక్తిగత ఇమేజ్‌తో ఆకట్టుకున్న లక్ష్మీనారాయణ
  • యువత, చదువరుల్లో ప్రత్యేక ఆకర్షణ

నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖలో ఈసారి పాగా ఎవరిది? ఇక్కడి నుంచి లోక్‌సభకు వెళ్లే ప్రతినిధి ఎవరు? ఓటింగ్‌ ముగిశాక నగర వాసుల్లో జరుగుతున్న చర్చ ఇది. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆకర్షించిన నియోజకవర్గాల్లో గాజువాక అసెంబ్లీ స్థానం, విశాఖ పార్లమెంటరీ స్థానాలున్నాయి. గాజువాక నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తుండడం, విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఆ పార్టీ తరపున మాజీ ఐపీఎస్‌ అధికారి, సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ రంగంలో ఉండడమే ఇందుకు కారణం.

గాజువాక సంగతి పక్కన పెడితే, విశాఖ లోక్‌సభ స్థానం విషయంలో పార్టీలకతీతంగా ఓ అభ్యర్థి విషయంలో చర్చ నడిచింది. ఆయనే లక్ష్మీనారాయణ. చతుర్ముఖ పోటీ జరిగిన ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పురందేశ్వరి తప్ప టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్థులు ముగ్గురూ రాజకీయాలకు కొత్తవారే. కానీ జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగిన లక్ష్మీనారాయణ పార్టీ ఇమేజ్‌ కంటే తనదైన వ్యక్తిగత గుర్తింపుతో నగరవాసుల్ని ఎక్కువగా ఆకట్టుకున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం.

గాలి జనార్దన్‌రెడ్డి, వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కేసుల విచారణ ప్రత్యేక అధికారిగా అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా లభించిన విశేష ప్రాచుర్యమే ఇందుకు కారణం. ఆ చరిష్మా లక్ష్మీనారాయణకు ఈ ఎన్నికల్లో బాగా ఉపయోగపడిందంటున్నారు. వాస్తవానికి నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో గాజువాక మినహా మిగిలిన చోట్ల జనసేన అభ్యర్థులు అంత బలమైన వారేమీ కాదు. యువతలో ఆ పార్టీ పట్ల ప్రత్యేక ఆకర్షణ ఉన్నప్పటికీ అది ఏ స్థాయి ఓటు బ్యాంక్‌ అన్నది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మాజీ జేడీ వ్యక్తిగత ఇమేజ్‌ కొంత అక్కరకు వచ్చిందని, నియోజకవర్గంలో నిన్న జరిగిన పోలింగ్‌లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని చెబుతున్నారు.

స్థానికేతరుడన్న విమర్శ వచ్చినప్పటికీ తాను ఇక్కడే ఇల్లు తీసుకుని నివాసం ఉంటానని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అలాగే తాను ఏం చేయబోతున్నదీ బాండ్‌ పేపర్‌పై రాసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. మాట తప్పితే తనపై ఎవరైనా కేసు పెట్టవచ్చని నగరవాసులకు హామీ ఇచ్చారు. పైగా విద్యావంతుడు, నిజాయతీపరుడన్న పేరుండడం కొన్నివర్గాల వారిని విశేషంగా ఆకర్షించింది.

నగరంలో స్థానికేతర ఓటర్లు గణనీయంగా ఉన్నారు. భారీ పరిశ్రమలు, సంస్థలు ఉండడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ప్రచారం సమయంలో ఆయా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు వీలైనంత వరకు అక్కడివారి భాషలో మాట్లాడి లక్ష్మీనారాయణ ఓట్లను అభ్యర్థించడం వారిని ఆకర్షించిందని చెబుతున్నారు. ఇలాంటి పలు అంశాలు క్రాస్‌ఓటింగ్‌కు కారణమయ్యాయని చెబుతున్నారు. పార్టీ అభిమానులు కూడా అసెంబ్లీ విషయంలో తమ అభిమాన పార్టీ అభ్యర్థికి ఓటేసినా, లోక్‌సభ అభ్యర్థికి వచ్చేసరికి లక్ష్మీనారాయణ పట్ల మొగ్గుచూపారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాకపోతే ఇదంతా నగర పరిధిలోని వాతావరణమే తప్ప గ్రామీణ ఓటర్లకు లక్ష్మీనారాయణ అంతగా తెలియదని, అక్కడ సానుకూల ఫలితం ఉండక పోవచ్చన్న అభిప్రాయం ఉన్నవారూ ఉన్నారు. ముఖ్యంగా విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలోకి వచ్చే ఎస్‌.కోట, భీమిలి నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ, నగరంలోని మురికివాడ ప్రాంతాల్లో ఓట్లు పడే అవకాశం లేదని వీరి అభిప్రాయం. మొత్తమ్మీద కొంత భిన్నాభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నా భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని, ఇది లక్ష్మీనారాయణకు లాభిస్తుందని చెబుతున్న వారి సంఖ్యే అధికంగా ఉండడం గమనార్హం.

visakha loksabha
cross voting
vvlakshminarayana
  • Loading...

More Telugu News