Andhra Pradesh: ఎన్ని చోట్ల రీపోలింగో నేడు తేల్చనున్న సీఈసీ!
- 6 చోట్ల ఈవీఎంల ధ్వంసం
- పలు చోట్ల హింసాత్మక ఘటనలు
- నేడు రీపోలింగ్ ఆవశ్యకతపై కేంద్రానికి రిపోర్టు
నిన్న జరిగిన తొలిదశ సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు 15 నమోదుకాగా, అందులో 6 ఏపీలోనే జరిగాయి. దాదాపు 300కు పైగా ఈవీఎంలు మొరాయించాయి. పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇక జరిగిన ఘటనలు, పోలింగ్ ఆగిపోయిన చోట్ల ప్రిసైడింగ్ అధికారులు ఇచ్చే నివేదికల ఆధారంగా రీపోలింగ్ ఎక్కడెక్కడ నిర్వహించాలన్న అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నేడు తేల్చనుంది.
ఈసీ పరిశీలకులు జరిగిన అన్ని ఘటనలపై వచ్చిన రిపోర్టులను ఈ ఉదయం పరిశీలించి, రీపోలింగ్ పై నిర్ణయం తీసుకుంటారని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేశ్ సిన్హా తెలిపారు. జరిగిన హింసాత్మక ఘటనల్లో ఒకరు మరణించారని అన్నారు. ఏపీలో 0.98 శాతం బ్యాలెట్ యూనిట్లు, 1.04 శాతం కంట్రోల్ యూనిట్లు, 1.6 శాతం వీవీ ప్యాట్లను మార్చామని ఆయన అన్నారు. నేటి మధ్యాహ్నానికి రీపోలింగ్ ఆవశ్యకతపై సెంట్రల్ ఈసీకి రిపోర్టు ఇవ్వనున్నట్టు తెలిపారు.