Narendra Modi: రికార్డు స్థాయిలో ఓటింగ్ జరగాలి: ట్విట్టర్‌లో ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
- యువత తరలిరావాలని ట్విట్టర్‌లో సందేశం
- ఈ ఏడాదే ఓటు హక్కు పొందిన వారు తప్పక వేయాలని సూచన
- దేశవ్యాప్తంగా ఓటు వేసిన పలువురు ప్రముఖులు
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలివిడత పోలింగ్ గురువారం జరుగుతున్న సందర్భంగా ఓటర్లకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 91 లోక్‌సభ నియోజకవర్గాలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు తొలివిడత ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని ఓటర్లకు ట్విట్టర్ సందేశం అందించారు. భారీ సంఖ్యలో ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
ముఖ్యంగా యువతీ యువకులు ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేస్తున్న వారు తప్పక సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రికార్డు స్థాయిలో ఓటింగ్ జరగాలని కోరారు. కాగా, తొలివిడత పోలింగ్ రోజు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ సాధారణ క్యూలో నిలబడి ఓటు వేశారు. నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం మన బాధ్యతని, ప్రతి ఒక్కరు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.