phuket: అక్కడ సెల్ఫీ తీసుకుంటే ఉరిశిక్ష అంటూ వార్తలు.. అవాస్తవమన్న ప్రభుత్వం!
- ఫుకెట్ దీవిలోని మైఖావో బీచ్‌లో సెల్ఫీలు దిగితే ఉరిశిక్ష అంటూ కథనాలు
- భయపడిపోయిన పర్యాటకులు
- స్పందించిన ప్రభుత్వం.. అలాంటి ఉత్తర్వులు ఏమీ లేవని స్పష్టీకరణ
థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ దీవిలో ఉన్న మైఖావో బీచ్‌లో సెల్ఫీలు దిగడాన్ని నిషేధించారని, అతిక్రమించి సెల్ఫీలు తీసుకుంటే మరణశిక్ష విధించాలని ప్రభుత్వం నిర్ణయించిందంటూ జరగుతున్న ప్రచారం ఉత్తదేనని తేలింది. ఇదంతా తప్పుడు ప్రచారమేనని, ఇందులో నిజం లేదని తేలడంతో పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే అత్యద్భుత ప్రదేశాల్లో ఫుకెట్ దీవి ఒకటి. ఇక్కడి అందాలను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. మైఖావో బీచ్‌కు సమీపంలోనే విమానాశ్రయం ఉండడంతో విమానాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుంది. విమానాలు ల్యాండ్ అవుతున్నప్పుడు అవి కనిపించేలా సెల్ఫీలు దిగడానికి పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు.
అయితే, పర్యాటకుల సెల్ఫీ సరదా కారణంగా పైలట్లు అసౌకర్యానికి గురవుతున్నారని, ఇకపై ఇక్కడ సెల్ఫీలు తీసుకోవడాన్ని నిషేధించామని, అతిక్రమిస్తే ఉరిశిక్ష తప్పదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందంటూ ఆంగ్లపత్రికల్లో కథనాలు ప్రచురించారు. దీంతో పర్యాటకులు బెంబేలెత్తిపోయారు.
ప్రభుత్వ నిర్ణయం సరికాదంటూ స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిబంధన ప్రభావం పర్యాటకులపై పడుతుందని, క్రమంగా పర్యాటకుల రాక పడిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వార్త కాస్తా వైరల్ అవడంతో స్పందించిన ప్రభుత్వం.. అది తప్పుడు వార్త అని, సెల్ఫీలపై ఎటువంటి నిషేధం లేదని తేల్చి చెప్పింది. దీంతో పర్యాటకులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.