Karnataka: ఓటు వేయలేదో.. వేతనంతో కూడిన సెలవు కట్: ఐటీ ఉద్యోగులకు షాకిచ్చిన బెంగళూరు కంపెనీలు
- ఓటు వేసినట్టు హెచ్‌ఆర్ విభాగంలో ఆధారం చూపించాల్సిందే
- లేదంటే ఆ రోజు వేతనం కట్
- ఐటీ కంపెనీల ఉత్తర్వులు
కర్ణాటకలోని బెంగళూరు, మైసూరులలో ఉన్న ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు షాకిచ్చాయి. పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవును మంజూరు చేసినప్పటికీ కొన్ని షరతులు కూడా విధించాయి. ఓటు వేసినట్టు కచ్చితంగా ఆధారం చూపించాల్సిందేనని, హెచ్‌ఆర్ విభాగంలో ఓటు వేసినట్టు రుజువు చూపిస్తేనే ఆ రోజున వేతనంతో కూడిన సెలవు మంజూరవుతుందని, లేదంటే వేతనంలో కోత తప్పదని హెచ్చరించాయి.
కంపెనీల హెచ్చరికలతో ఉద్యోగులు తలలుపట్టుకుంటున్నారు. గురువారం పోలింగ్ సెలవు, రెండు వీకెండ్ హాలిడేస్ కలుపుకుంటే వరుసగా మూడు రోజులపాటు సెలవులు ఎంజాయ్ చేయాలనుకున్న ఉద్యోగులు కంపెనీల ఉత్తర్వులతో ఆలోచనలో పడ్డారు.
ఇక, ఐటీ సంస్థల హెచ్చరికలతో నిజమైన ఉద్యోగులు అందరూ ఓటింగ్‌లో పాల్గొంటే బెంగళూరులో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 10 లక్షల ఓట్లు అధికంగా పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేసేందుకు సహకరించాలంటూ ఎన్నికల సంఘం చేసిన సూచన మేరకు ప్రముఖ ఐటీ సంస్థలైన ఇన్ఫోసిస్, యాక్సెంచర్ సహా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ హెచ్చరికలు జారీ చేశాయి.