Nayanatara: నేనేమైనా క్షమించరాని నేరం చేశానని క్షమాపణలు చెప్పాలా?: నయనతారపై వ్యాఖ్యల గురించి రాధారవి
- ఎవ్వరికీ క్షమాపణలు చెప్పలేదు
- అది నా రక్తంలోనే లేదు
- నిజం మాట్లాడితే మద్దతు పలుకుతారు
- నేనెందుకు భయపడాలి?
గతంలో ప్రముఖ కథానాయిక నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కిన ప్రముఖ తమిళ నటుడు రాధా రవి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో చేసిన వ్యాఖ్యలపై అసలు తానెందుకు క్షమాపణలు చెప్పాలంటూ ప్రశ్నించారు. ‘ఎనక్కు ఇన్నోరు ముగమ్ ఇరుకు’ అనే లఘు చిత్రానికి సంబంధించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాధా రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనేమైనా క్షమించరాని నేరం చేశానని నయనతారకు క్షమాపణ చెప్పాలా? అని మండిపడ్డారు.
‘‘నేను తప్పుగా మాట్లాడి ఉంటే నా మాటలను వెనక్కి తీసుకుంటానని గతంలో చెప్పాను. కానీ నేనెప్పుడూ ఎవ్వరికీ క్షమాపణలు చెప్పలేదు. అది నా రక్తంలోనే లేదు. అసలు నయనతారకు నేనెందుకు క్షమాపణలు చెప్పాలి? క్షమించరాని నేరం చేశానా?ఈ రోజు నేను మాట్లాడుతుంటే ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు. ఆ రోజు నయనతార గురించి మాట్లాడినప్పుడు కూడా ఇదే విధంగా చప్పట్లు కొట్టి అభినందించారు. నేను నిజం మాట్లాడితే ప్రజలు నాకే మద్దతు పలుకుతారు. అయినా నేనెందుకు భయపడాలి? నన్ను సినిమాల్లో నటించనివ్వమంటూ చాలా మంది బెదిరిస్తున్నారు. నన్నెవ్వరూ ఆపలేరు. ఇలాంటివన్నీ తాత్కాలికమే. నా మాటల్లో నిజం ఉంటే ఒప్పుకోండి. లేకపోతే వదిలేయండి’ అని రాధా రవి తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.