isreal: ఎదురులేని నెతన్యాహూ.. ఇజ్రాయెల్ ప్రధానిగా ఐదోసారి ఘనవిజయం!
- జాతీయ ఎన్నికల్లో సత్తా చాటిన లికుడ్ పార్టీ
- మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నెతన్యాహూ
- విజయం అనంతరం ప్రజలకు కృతజ్ఞతలు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ(69) సత్తా చాటారు. ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికల్లో ఐదో సారి ఇజ్రాయెల్ ప్రధానిగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో నెతన్యాహూ పోటీ చేస్తున్న లికుడ్ పార్టీకి 37 సీట్లు రాగా, ప్రతిపక్ష బ్లూ అండ్ వైట్ పార్టీ 36 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది.
షాస్(8), యునైటెడ్ తోరాస్ జుడాయిజం(8), హదష్(6), ఇజ్రాయెల్ లేబర్ పార్టీ(6) యునైటెడ్ రైట్(5) పార్టీలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొత్తం 120 సీట్లు ఉన్న ఇజ్రాయెల్ పార్లమెంటు(నెస్సెట్)లో 61 స్థానాలను దక్కించుకున్న పార్టీ అధికారం చేపడుతుంది. ఇజ్రాయెల్ పార్లమెంటుకు ప్రతీ నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి.
ఈరోజు 97 శాతం కౌంటింగ్ పూర్తయిన నేపథ్యంలో బెంజమిన్ నెతన్యాహూ ఇజ్రాయెల్ ప్రధానిగా ఎన్నికైనట్లు ఇజ్రాయెల్ మీడియా ప్రకటించింది. కాగా, ఈ ఫలితాల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన నెతన్యాహూ.. భావసారూప్యత ఉన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇందుకోసం మిగతా చిన్నపార్టీలతో చర్చలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ నెతన్యాహూ 2009 నుంచి వరుసగా విజయాలు సాధిస్తుండటం గమనార్హం.