Uttar Pradesh: కాంగ్రెస్-ఎస్పీ-బీఎస్పీ వద్ద అలీ ఉంటే.. మా వద్ద భజరంగ్‌బలి ఉన్నాడు: సీఎం యోగి
- మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం
- మాయావతి వ్యాఖ్యలకు కౌంటర్‌గా తమ వద్ద భజరంగ్‌బలి ఉన్నాడని వ్యాఖ్య
- ఇటీవల ఆర్మీని మోదీసేనగా పేర్కొన్న ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆర్మీని ‘మోదీ సేన’గా అభివర్ణించిన ఆయన ముస్లిం లీగ్‌ను ‘వైరస్’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలను ఉద్దేశించి మరోమారు అటువంటి వ్యాఖ్యలే చేశారు.
కాంగ్రెస్-ఎస్పీ-బీఎస్పీలకు ‘అలీ’పై విశ్వాసం ఉంటే తమకు భజరంగ్‌బలి (హనుమంతుడు)పై నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరట్‌లో ప్రసంగిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల క్రితం బీఎస్పీ చీఫ్ మాయావతి మాట్లాడుతూ.. ముస్లిం ఓటర్లను ఉద్దేశించి తమకు మద్దతు పలకాల్సిందిగా కోరారు. ‘‘పశ్చిమ ఉత్తరప్రదేశ్ ముఖ్యంగా షహరాన్‌పూర్, బరేలీలో ముస్లింలు ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు. నేను మీకోటి చెప్పాలనుకుంటున్నా. మీరంతా కాంగ్రెస్‌కు ఓటేసి ఓట్లను చీల్చొద్దు. ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్‌డీ కూటమికి మీ ఓటు వేసి గెలిపించండి’’ అని మాయావతి అభ్యర్థించారు. ఆమె వ్యాఖ్యలకు కౌంటర్‌గా యోగి ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.