Hungary: అంగారకుడిపై జీవం వుండేది.. శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడి!
- అంగారక గ్రహశిలపై వివిధ రూపాల్లో బ్యాక్టీరియా
- 1977-78 మధ్య అంటార్కిటికాలో లభించిన ఉల్క
- మరింత విస్తృత పరిశోధన అవసరమన్న హంగేరియన్ శాస్త్రవేత్తలు
అంగారకుడిపై జీవం ఆనవాళ్ల కోసం పరిశోధిస్తున్న శాస్త్రవేత్తల కృషి ఫలించినట్టే కనిపిస్తోంది. అరుణగ్రహంపై ఒకప్పుడు జీవం ఉండేదా? అన్న ప్రశ్నకు ఇన్నాళ్లకు సమాధానం దొరికిందని చెబుతున్నారు. ఉల్కాపాతం ద్వారా లభించిన అంగారక గ్రహానికి చెందిన ఓ శిలలో వివిధ రూపాల్లో బ్యాక్టీరియా ఉన్నట్టు హంగేరీకి చెందిన పరిశోధనకారులు గుర్తించారు. అక్కడి అనేక ఖనిజాల్లో జీవం ఉనికిని గుర్తించినట్టు పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు జీవాన్ని గుర్తించినట్టు చెబుతున్న ఈ శిలను 1977-1978 మధ్య అంటార్కిటికా ప్రాంతంలో గుర్తించారు. అలాన్ హిల్స్ ప్రాంతంలో గుర్తించిన ఈ శిలకు శాస్త్రవేత్తలు ఏఎల్‌హెచ్-77005గా పేరుపెట్టారు.
ఈ అంగారక శిలపై ఆర్గానిక్ మెటీరియల్ (సేంద్రియ పదార్థం) ఉన్నట్టు హంగేరియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (హెచ్ఏఎస్) రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఎర్త్ సైన్సెస్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ బ్యాక్టీరియా వివిధ రూపాల్లో ఉందని పేర్కొన్నారు. అయితే, దీనిపై మరింత విస్తృత పరిశోధన అవసరమని హెచ్ఏఎస్ పేర్కొంది.